
ఈ కులం ఏంటి? ఈ మతం ఏంటి? వీటిని వదిలేసుకుంటే పోలా.. అని మీకెప్పుడైనా అనిపించిందా? BBC TELUGU
కాశ్మీరీ బ్రాహ్మణుడైన మన దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అజ్ఞేయవాది. అంటే.. తనకు మత విశ్వాసాలేమీ లేవని, దేవుడు ఉన్నాడో, లేదో తనకు అనవసరమని స్పష్టంగా చెప్పారు. కానీ, నెహ్రూ చనిపోయినప్పుడు మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారమే ఢిల్లీలోని యమునా తీరంలో ఆయన అంత్యక్రియలు చేశారు.
పుట్టినప్పట్నుంచి, చనిపోయే వరకు మనల్ని వీడనిది నీడ ఒక్కటే కాదు. కులం, మతం కూడా! వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం.
పుట్టిన పాపాయిని చూడ్డానికొచ్చే బంధువులు, స్నేహితుల కంటే ముందే కులం, మతం వచ్చేస్తాయి బర్త్ సర్టిఫికెట్ రూపంలో.
మనిషి మరణించాక కూడా అవి వదిలిపెట్టవు. డెత్ సర్టిఫికెట్ రూపంలో చాలా భద్రంగా ఉంటాయి.
కుల వ్యవస్థను నిర్మూలించాలని, కుల రహిత సమాజం కోసం పోరాడాలని స్వాతంత్ర్యం రాకముందు నుంచే మన దేశంలో ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి.
ఇప్పటికీ వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు ఈ దిశగా చాలా కష్టపడుతున్నాయి.
మతం, దేవుడు విషయాల్లో చాలా శతాబ్దాల కిందటే మనది చైతన్యవంతమైన సమాజంగా పేరొందింది.
వదులుకోవటం ఈజీ.. నిరూపించటం కష్టం
ఈయన పేరు దువ్వూరి వెంకట రామకృష్ణారావు. హిందూ మత విశ్వాసాన్ని బట్టి కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి, ద్వాపరయుగ దైవం రాముడు, త్రేతాయుగ దైవం శ్రీకృష్ణుడి పేర్లు కలిగిన ఈయన పుట్టుకతో బ్రాహ్మణుడు.
అయితే, అటు కులాన్ని, ఇటు మతాన్ని వదిలేసి తనకంటూ ప్రత్యేకంగా బతకాలని కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు.
తనకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలకు ఏ మతంతోనూ సంబంధం లేకుండా సహజ, స్పందన అని పేర్లు పెట్టారు.
ఆదర్శంగా ఉండాలని మైనార్టీ తీరే వరకూ ఏ కులం, మతం లేకుండా పిల్లల్ని పెంచాలని నిర్ణయించుకున్నారు.
కానీ, ఆయన ఆదర్శాలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డొచ్చాయి.
కూతురి స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ‘మీ కులం, మతం ఏంటో రాయండి’ అని స్కూల్ వాళ్లు పట్టుబట్టారు. ‘నాకు ఏ కులమూ లేదు. ఏ మతమూ లేదు’ అని రామకృష్ణారావు చెప్పినా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదో ఒక కులం, మతం రాయాల్సిందేనని స్పష్టం చేశారు.
కులాన్ని, మతాన్ని వదులుకోవటం ఈజీయే. కానీ, నాకు కులం, మతం లేవు అని నిరూపించుకోవటం ఎలా?
కులం చెప్పకుండా తప్పించుకోవచ్చు! కానీ..
బర్త్, డెత్ సర్టిఫికెట్లు, స్కూల్ అడ్మిషన్ ఫారమ్‌లు, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు, ఎంప్లాయ్మెంట్ అప్లికేషన్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లకు కులం, మతం వివరాలు చెప్పాల్సి వస్తోంది.
ఆధార్ కార్డు, ఓటరు కార్డు పొందేందుకు మాత్రం అవి అక్కర్లేదు.
కులం విషయంలో కొంత వెసులుబాటు ఉంది. రిజర్వేషన్ అవసరం లేదనుకుంటే ఓసీ.. అంటే ఓపెన్ కేటగిరీ అని రాసేయొచ్చు. కానీ, మతం విషయంలో అలా తప్పించుకోలేం.
ప్రస్తుతం మతం అనే ఆప్షన్ కింద మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధం, జైన్, ఇతరులు మాత్రమే ఉన్నాయి.
”ఆరు మతాల్లో ఏదో ఒకటి ఎంచుకోకుంటే.. ఇవేమీ కాని మరో మతం ‘ఇతరులు’ అనేది ఎంచుకోవాల్సి వస్తోంది. అంతే తప్ప ‘నాకు మతం లేదు’ అని చెప్పుకునేందుకు అవకాశమే లేదా?” అని రామకృష్ణారావు తొలుత పాఠశాల యాజమాన్యాన్ని, తర్వాత డీఈఓను, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వాళ్లెవ్వరూ స్పందించకపోవటంతో కేంద్ర మానవ వనరుల శాఖ, జాతీయ జన గణన విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్లేమో ఇది రాష్ట్ర సమస్య అని సమాధానం ఇచ్చారు.
ఎవ్వరూ దీన్ని పరిష్కరించకపోవటంతో ఆయన హైకోర్టులో కేసు వేశారు.
రామకృష్ణారావు వాదనల్లో మెరిట్ ఉందని గుర్తించిన హైకోర్టు ఆయనకు న్యాయం చేసింది. మతాన్ని వెల్లడించలేదన్న కారణంతో స్కూల్ అడ్మిషన్ తిరస్కరించకూడదని 2010లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కానీ, నాలుగేళ్ల తర్వాత రామకృష్ణారావు మరో కూతురికి కూడా ఇదే సమస్య తలెత్తింది. దీంతో మళ్లీ ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.
తనది మాత్రమే కాదని, తనలాంటి వాళ్లందరి సమస్యను పరిష్కరించాలని కోరారు. దానిపై విచారణ జరుగుతోంది. తెలంగాణ టీచర్ల సంఘం కూడా పిటిషన్ వేసి ఈ కేసులో భాగస్వామి అయ్యింది.
”క్రీస్తును ఆరాధిస్తాం..క్రిస్టియన్లం కాదు”
నిజానికి కులాన్ని, మతాన్ని వదులుకున్నవాళ్లు మన సమాజంలో చాలామందే ఉన్నారు. కులానికి, మతానికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లూ ఉన్నారు.
దేవుడే లేడనే నాస్తికులే కాకుండా.. దేవుడు ఉన్నాడో లేడో తెలియదనే అజ్ఞేయులు ఉన్నారు.
దేవుడిని విశ్వసిస్తాం.. ఆరాధిస్తాం.. కానీ మాకు మతం లేదు అనేవాళ్లూ ఉన్నారు. ముంబైకి చెందిన ‘ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ గాడ్’ సంఘం వాళ్లు అలాంటివాళ్లే.
ఇందులో నాలుగువేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. తాము క్రీస్తును ఆరాధిస్తామని, అయితే తాము క్రిస్టియన్లం కాదని, తమకు ఏ మతమూ లేదని, కాబట్టి ఏ మతానికి చెందని వారిగా తమకు గుర్తింపు ఇవ్వాలని వాళ్లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో వాళ్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
మూడేళ్ల కిందట బాంబే హైకోర్టు ఈ కేసులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
”..మతం ఏంటో చెప్పాలని ఎవరినీ బలవంతం చేయొద్దు. తమకు ఏ మతమూ లేదని చెప్పే హక్కు ప్రజలకు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఉంటుంది” అని పేర్కొంది.
కులం.. ఎడతెగని వివాదం
కులం అనేది చాలా తక్కువ దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది. మన దేశంలో మాత్రం కులం చాలా లోతుగా సమాజంలో భాగమైపోయింది.
కులం వదులుకోవటం వల్ల తలెత్తే సమస్యలకు సరైన పరిష్కారాలు లభించటం లేదు. దీంతో ఇదో పెద్ద చిక్కుముడిగా మారిపోతోంది.
కులాంతర, మతాంతర వివాహాలు జరిగినప్పుడు, మతం మార్చుకున్నప్పుడు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి.
రిజర్వేషన్ ఉన్న కులానికి చెందిన వారు మతం మారితే వారి రిజర్వేషన్ స్థాయి కూడా మారిపోతోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించకపోవటంతో నానాటికీ కులం చిక్కుముడి పెరుగుతోంది.
తండ్రి మతాన్నే పిల్లలు ఆచరించాలా?
కుటుంబంలో ఏ మతాన్ని ఆచరిస్తున్నారో.. ఆ కుటుంబంలో పుట్టే పిల్లలు కూడా అదే మతాన్ని ఆచరించాలా? ఇంట్లో పెద్దోళ్లు మతం మార్చుకుంటే పిల్లలు కూడా మారాల్సిందేనా?
వినటానికి కొత్తగా అనిపిస్తున్నప్పటికీ ఇది చాలా పాత ప్రశ్న. ఎంత పాతదంటే.. మన రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నప్పుడు రాజ్యాంగ అసెంబ్లీలో కూడా దీనిపై చాలా చర్చ జరిగింది.
18 ఏళ్లు నిండిన తర్వాతే.. తగినంత జ్ఞానంతో పిల్లలు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కల్పించాలని పలువురు సభ్యులు వాదించారు.
దేశంలో చాలామంది అనాథలు ఉన్నారు. వారికి ఏ మతం వర్తిస్తుంది? ఏ కులం వర్తిస్తుంది? అన్న వివాదం ఇంకా కొనసాగుతోంది.
దీనిపై ఇప్పటికీ చాలామంది పార్లమెంటు సభ్యులు లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెడుతున్నారు.
రాజ్యాంగ అసెంబ్లీలో దీనిపై జరిగిన చర్చలో డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి లేకుండా పిల్లల మత మార్పిడిని అంగీకరించకుండా రాజ్యాంగంలో నిబంధన విధిస్తే తనకు అభ్యంతరం ఏమీ లేదన్నారు.
”మా ఇంట్లో ఏ మతాన్నీ ఆచరించం. కానీ, నా పిల్లలు అన్ని మతాల గురించి తెలుసుకుంటారు. తర్వాత వాళ్లకు నచ్చిన మతాన్ని ఎంచుకుంటారు” అని రామకృష్ణారావు చెప్పారు.
మీరెప్పుడైనా గమనించారా? జనాభా లెక్కల సర్వే చేసేప్పుడు కుటుంబ యజమాని కులం, మతం ఏంటని అడుగుతారే తప్ప.. ఇంట్లో కుటుంబ సభ్యుల కులం, మతం గురించి అడగరు.
ఏ మతమూ లేనివాళ్లు.. 116 కోట్ల మంది
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మతం ఏంటి? 2050 నాటికి ఏది అతిపెద్ద మతం అవుతుంది? అన్న అంశంపై అమెరికాకు చెందిన పీఈడ్ల్యు రీసెర్చి సెంటర్ ఒక అథ్యయనం చేసింది.
ప్రపంచంలో ప్రస్తుతం క్రైస్తవులు, ముస్లింల తర్వాత అతిపెద్ద మతం.. ఏ మతమూ లేకపోవటమే. ఏ మతానికి చెందని ప్రజలు ప్రపంచంలో 116.50 కోట్ల మంది ఉన్నారని ఈ రీసెర్చ్‌లో తేలింది.
మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ మతమూ చెప్పనివాళ్లు 28 లక్షల మందికి పైనే ఉన్నారు.
మీరు వదులుకుంటారా?
‘మీరేంటి?’, ‘మనోళ్లే’.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పదాలివి.
కులాన్ని పెద్దగా పట్టించుకోని వాళ్ల సంఖ్య కూడా మన సమాజంలో బాగా పెరుగుతోంది.
ఇలాంటి సందర్భంలో నిజంగా ప్రభుత్వం ముందుకొచ్చి ‘కులాన్ని వదులుకోవాలనుకుంటున్నారా? మతాన్ని వదులుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. మేం గుర్తిస్తాం’ అంటే ఎలాంటి స్పందన వస్తుందంటారు?
వీటిని వదులుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?
0 Comments
No Comments Yet!
You can be first to comment this post!