యూపీ: ఎన్‌కౌంటర్లలో ముస్లింలూ, దళితులే ఎందుకు హతులవుతారు? BBC తెలుగులో కథనం

యూపీ: ఎన్‌కౌంటర్లలో ముస్లింలూ, దళితులే ఎందుకు హతులవుతారు? BBC తెలుగులో కథనం

పది నెలల కాలంలో 1100కు పైగా ఎన్‌కౌంటర్లు.. 35 మందికి పైగా ‘నేరస్తుల’ మృతి.. ఈ లెక్కలు ఏదో సినిమా కథలాగా అనిపించొచ్చు కానీ ఇది పచ్చి నిజం.

జనాభా రీత్యా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యమయ్యాయి. ఇటీవల విధానమండలి సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు కూడా. రాష్ట్రంలో నేరాలను అరికట్టాలంటే ఎన్‌కౌంటర్లను నిలిపివేసే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు కూడా.

మొత్తం 1200 ఎన్‌కౌంటర్లలో 40 మంది ప్రమాదకరమైన నేరస్తులు మరణించినట్టు ముఖ్యమంత్రి చెప్పారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

మరోవైపు, ఈ ఎన్‌కౌంటర్ల విషయంలో విపక్షాలు అధికార బీజేపీపై ధ్వజమెత్తాయి. యోగి ప్రభుత్వం ప్రతి రంగంలోనూ వైఫల్యం చెందిందనీ, తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే అది విచ్చలవిడిగా ఎన్‌కౌంటర్లు చేస్తోందని సమాజ్‌వాదీ పార్టీ విమర్శించింది.

ఆ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధరి బీబీసీతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పాలక నేతలు రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారనీ, రాష్ట్రంలోని మొత్తం 22 కోట్ల మందిని ఈ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.

ఎన్‍‌కౌంటర్లలో మైనారిటీ వర్గాలనే లక్ష్యం చేసుకుంటున్నారని సమాజ్‌వాదీ పార్టీ అంటోంది.
“రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువజనులకు ఉద్యోగాలు లేవు. న్యాయం కావాలని రాజధాని లఖ్నౌకు వెళ్తున్న జనాలపై లాఠీచార్జి చేశారు” అని ఆయనన్నారు.

జనవరి 18న మథురాలో పోలీసు కాల్పుల్లో ఒక బాలుడు మృతి చెందాడు. సెప్టెంబర్ 15న నోయిడాలో జరిగినట్టుగా చెప్పిన ఎన్‌కౌంటర్‌లో ముస్లిం సముదాయానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో, ఎన్‌కౌంటర్ల పేరిట సాధారణ ప్రజలనూ, అల్పసంఖ్యాక వర్గాలను బలి గొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఎన్‌కౌంటర్లలో నిర్దోషులు ప్రాణాలు కోల్పోతున్నారనీ, ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని రాజేంద్ర చౌధరి అన్నారు.

“జనాలను టార్గెట్ చేసి అన్యాయంగా శిక్షిస్తున్నారు. వెనుకబడిన తరగతుల వారిని, దళితులను, మైనారిటీ వర్గాలను, రైతులను లక్ష్యంగా చేసి ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. నేరస్తుల పట్ల సానుభూతి చూపడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి యోగి విధానమండలిలో అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన అభివర్ణించారు.

ఎన్‌కౌంటర్లు కొనసాగుతాయి: యోగి
బీజేపీ యూపీ మీడియా ఇన్‌చార్జి హరిశ్చంద్ర శ్రీవాస్తవ బీబీసీతో మాట్లాడుతూ, “అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో ఉత్తర్ ప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలింది. వీధుల్లో కత్తులతో కవాతులు జరిగేవి. గూండాలు భూముల్ని ఆక్రమించుకునేవారు. కానీ సమాజ్‌వాదీ ముఖ్యమంత్రి మాత్రం తన కార్యాలయంలో కూర్చొని చోద్యం చూసేవారు” అని అన్నారు.

ఎన్‌కౌంటర్లలో వెనుకబడిన కులాల వారిని, దళితులను, మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే ప్రతిపక్షాల ఆరోపణలపై మాట్లాడుతూ, ఇదంతా సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న కులతత్వ రాజకీయాలేనని హరిశ్చంద్ర శ్రీవాస్తవ అన్నారు. ఈ ఆరోపణల్లో హేతుబద్ధత గానీ, సరైన ఆధారాలు గానీ ఏవీ లేవని ఆయన అన్నారు.

మథురాలో జరిగినట్టుగా చెప్పిన ఎన్‌కౌంటర్‌లో ఒక బాలుడు మృతి చెందిన ఘటనపై వివరణ ఇస్తూ, ఈ కేసులో ముగ్గురు పోలీసు ఉద్యోగులను సస్పెండ్ చేశామని శ్రీవాస్తవ చెప్పారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.

పెరుగుతున్న నేరాలను అరికట్టడం కోసమే ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయనే భావన ప్రచారంలో ఉంది.
ఎన్‌కౌంటర్లలో లక్ష్యం ఎవరిపై?
అయితే ఎన్‌కౌంటర్ల వెనుక రాజకీయ ఉద్దేశాలుంటాయా? కొన్ని ప్రత్యేక సముదాయాలను ఎంపిక చేసుకొని ఎన్‌కౌంటర్లు చేస్తుంటారా?

పై ప్రశ్నలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ ఐజీ ఎస్ఆర్ దారాపురి బీబీసీతో మాట్లాడారు. పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లలో అత్యధికం రాజ్యం చేయించేవేనని అని దారాపురి అన్నారు. 90 శాతం ఎన్‌కౌంటర్లు బూటకమైనవే అని ఆయన చెప్పారు.

“ఎన్‌కౌంటర్లు రాజకీయ దురుద్దేశాలతో జరిగినప్పుడు వాటిలో చనిపోయేది సాధారణంగా పాలక పక్షానికి పట్టింపు లేని సముదాయాలకు చెందిన వారో లేదా పాలకపక్షం అణిచెయ్యాలని చూస్తున్న సముదాయాలకు చెందిన వారో అయి ఉంటారు. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారు ఏ సముదాయాలకు చెందిన వారన్న వివరాలు యూపీ ప్రభుత్వం వెల్లడి చేయాలి. అట్లాగే కాళ్లపై బుల్లెట్లు పేల్చి గాయపరుస్తున్నది ఏ సముదాయాల వారిని అనే వివరాలు కూడా చెప్పాలి” అని ఆయనన్నారు.

“నాకున్న సమాచారం ప్రకారం, ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధికులు ముస్లింలు, బాగా వెనుకబడిన వారు, దళితులే. మృతులలో సవర్ణ కులాల వారు బహుశా ఒక్కరు కూడా లేకపోవచ్చు. బాధితుల కుటుంబాలను కలిసి వచ్చిన తర్వాత ఒక పాత్రికేయుడు నాతో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్లలో ముస్లింలే ఎక్కువగా మరణిస్తున్నారని చెప్పాడు. మరి కొందరిని కాళ్లపై కాల్పులు జరిపి గాయపరిచారనీ, వారికి చికిత్స కూడా అందలేదని చెప్పాడు. ముస్లింలతో పాటు దళితులూ, బాగా వెనుకబడిన కులాల వారు కూడా ఎన్‌కౌంటర్లలో మరణిస్తున్నారు.”

ఎన్‌కౌంటర్లను పెరిగిపోతున్న నేరాలను అరికట్టే ఆయుధాలని కూడా భావిస్తారు. యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, నేరస్తులు చెలరేగిపోయినప్పుడు ఇలాంటి చర్యలు అవసరమవుతాయని అన్నారు. పోలీసులపైనే దాడులు జరుగుతున్నట్టయితే బుల్లెట్‌కు జవాబు బుల్లెట్‌తోనే ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

“నేరాలను అంతం చేయాలంటే చాలా పనులు చేయాల్సి ఉంటుంది. యూపీలో జరిగిన వెయ్యి ఎన్‌కౌంటర్లలో 30-35 మంది నేరస్తులు చనిపోయారంటే ఇదేమంత పెద్ద సంఖ్య కాదు. ఎన్‌కౌంటర్లన్నీ బూటకమే అనడం సరికాదు” అని ప్రకాశ్ సింగ్ అన్నారు.

యూపీలో ప్రతి ఎన్నికల సందర్భంలోనూ పెరిగిపోతున్న నేరాలు అనేది ఒక చర్చనీయాంశంగా ముందుకు వస్తుంది. దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం కావడం వల్ల ఇక్కడ నేరాల స్థాయి కూడా అధికంగానే ఉంది. యూపీలో నేరాలు బాగా పెరిగిపోయాయని ప్రకాశ్ సింగ్ అంటారు.

గతంలో ఓసారి, జైలులో ఉండాల్సిన ఒక మాఫియా డాన్ అసెంబ్లీ లోపలికి వెళ్లి ఒక వీఐపీ మంత్రిని కలిసి వస్తుండగా తీసిన ఫొటోను ఓ పత్రిక ప్రచురించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నేరస్తులకు మానవ హక్కులు వర్తిస్తాయా?
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారీ మానవ హక్కుల ప్రశ్న తలెత్తుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ యూపీ ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని కోరింది.

మానవ హక్కుల అంశంపై మాట్లాడుతూ ప్రకాశ్ సింగ్, “పెరిగిపోతున్న నేరాలను నియంత్రించడానికి కఠిన చర్యలు అవసరమే. సరైన వాతావరణంలోనే మానవ హక్కులు వర్తిస్తాయి. కానీ ఒక నేరస్తుడు తుపాకీ పేల్చినపుడు అతని మానవ హక్కులు సమాప్తమవుతాయి. మానవ హక్కులంటే అర్థం దుండగులు బుల్లెట్లు కాలుస్తుంటే, పోలీసు ఉద్యోగులు నన్ను కాల్చి చంపు అంటూ ఎదురుగా రొమ్ము విరుచుకొని నిల్చోవడం కాదు” అని అన్నారు.

నేరస్తులకు వర్తించే మానవ హక్కుల గురించి ఆయన వివరంగా మాట్లాడారు. నేరస్తులు పట్టుబడినప్పుడు వారిని హింసించగూడదు. నిరాయుధంగా ఉన్నప్పుడు వారిపై కాల్పులు జరపగూడదు. వీటని మానవ హక్కులలో భాగంగా చూడాలి.

ఆత్మరక్షణ కోసం కాల్పులు చేయాల్సి ఉంటుందనే దానిపై ఎస్.ఆర్. దారాపురి కూడా ఏకీభావం వ్యక్తం చేశారు. కానీ అసలు ఎన్‌కౌంటరే బూటకమైనప్పుడు ఎలా అన్నది ఆయన ప్రశ్న.

లఖ్నౌలోని ఏటీఎస్ హెడ్‌క్వార్టర్స్‌లో యూపీ డీజీపీ ఓ.పీ. సింగ్
“నేను పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పని చేశాను. 90 శాతానికి పైగా ఎన్‌కౌంటర్లు బూటకమైనవని నా నమ్మకం. నిజమైన ఎన్‌కౌంటర్లు చాలా అరుదుగా జరుగుతాయి. మిగిలిన ఎన్‌కౌంటర్లన్నీ చాలా పథకం ప్రకారం, రాజ్యం కనుసన్నల్లోనే జరుగుతాయి” అని దారాపురి అంటారు.

ఎన్‌కౌంటర్లతో నేరాలను అదుపు చేయడం సాధ్యమేనా? ఈ ప్రశ్నతో ప్రకాశ్ సింగ్, దారాపురి ఇద్దరూ ఏకీభవించలేదు. పోలీసు సంస్కరణలే దీనికి పరిష్కారమని వారిరువురూ అభిప్రాయపడ్డారు.

“పోలీసులకు తమవైన సమస్యలు చాలా ఉన్నాయి. పోలీసు ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. వారిపై వీఐపీ సెక్యూరిటీ, పరీక్షల డ్యూటీల భారం మోపారు. నిజమైన పోలీసింగ్ పనుల్ని వారు చేపట్టలేకపోతున్నారు. దాని ఫలితంగానే నేరాలను అరికట్టడం కష్టమవుతోంది” అని దారాపురి అన్నారు.

భారతదేశంలో ఎన్‌కౌంటర్లకు చాలా చరిత్ర ఉంది. సోహ్రాబుద్దీన్ షేఖ్, ఇష్రత్ జహాన్, మావోయిస్టు ఆజాద్, హాషిమ్‌పురా ఎన్‌కౌంటర్లు బాగా చర్చనీయాంశమయ్యాయి. వీటిపై కేసులు న్యాయస్థానాలకు కూడా చేరాయి.

అయితే, యూపీలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లపై వివాదం మరింత మదురుతుందా, ఇక ముందు కూడా ఇవి ఇలాగే కొనసాగుతాయా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం మాత్రం ఎదురు చూడాల్సిందే…

(Visited 17 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply