బౌద్దం, క్రైస్తవం… దొందూ దొందే!- ఇండస్ మార్టిన్

బౌద్దం, క్రైస్తవం… దొందూ దొందే!- ఇండస్ మార్టిన్

——————————————-
బాబా సాహెబ్ అంబేడ్కర్ బౌద్దాన్ని ఒక మతంగా స్వీకరించలేదు. కేవలం హైందవ మతంలో వున్న కులపీడనకు ధిక్కారంగా alternative ధర్మాన్ని పట్టుకున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎప్పుడూ బౌద్దమతాచారాలను ప్రోత్సహించలేదు, నిజానికి వాటిని వ్యతిరేకిస్తూ హీనయాన మహాయానాలకు భిన్నంగా నవయానాన్ని ప్రతిపాధించారు.
ప్రస్తుతం అధికంగా అంబేడ్కరిస్టులు అని చెప్పుకొనే దళిత, మూలవాసీ, బహుజనుల సమూహాల్లో బహుజనులు ఎప్పటిలానే హైందవ మత ప్రభావంలోనో లేదా ఇస్లాం మతాచారాల్లోనో కొనసాగడానికే ఇష్టపడుతున్నారు. ఎటొచ్చి దళితులే అటూ ఇటూ కొట్టుమిట్టాడుతున్నారు.
బౌద్దమతాన్ని పాటించాలనుకునే చాలమంది దళితులు ఒక మోసాన్ని గుర్తించాలి. హైందవ మతం ఒక తిమింగలం. చుటుపక్కల పరిఢవిల్లుతున్న ఏ మతాన్నైనా లేదా ఆచారాన్నైనా అది మింగేసి తనలో కలిపేసుకోని కాలక్రమంలో అది తనసొంత శరీరభాగమని ప్రచారం చేసుకుంటుంది. దళితులకు, శూద్రులకు మాత్రమే పరిమితమైన గ్రామదేవతలూ పొలిమేర దేవతలను తెలివిగా తనలో కలుపుకుని ఈరోజు ఆయా పూజాక్రతువులన్నిటిలోకీ బ్రాహ్మణ పూజారులనూ మంత్ర తంత్రాలనూ చొప్పించి మళ్ళీ ఇక్కడా తన పెద్దపీటను స్థిరం చేసుకుంది.
అలాగే ఇండియాలో బౌద్దం కూడా ఈ దురవస్థనుండి తప్పించుకోలేకపోయింది. ఇండియా, నేపాల్ అలాగే చుట్టూవున్న అనేక సౌత్ ఏషిన్ దేశాల్లో బౌద్దారాధనల్లో హైందవ కంపు మనం వద్దన్నా ముక్కును తాకుతుంది. ఈరోజు బౌద్దంలో లేని సాంప్రదాయాలూ, క్రతువు నియమాలూ అలాగే మతాధిపతుల నియంత్రణలు మరే మతంలోనూ లేవు.
2002 సంవత్సరంలో స్వయంగా దలైలామాతో కొన్నిరోజులు గడిన అనుభవం నాది. అలాగే ధర్మశాలలోని మెక్లోడిగంజ్ లో చాలారోజులు నివశించిన అనుభవం వుంది నాకు. అక్కడ నేను గమనించిందేంటంటే సన్యాసులూ సన్యాసినిలూ రోజులో ఎక్కువభాగం బౌద్ద దమ్మంలోని శ్లోకాల్ని వల్లెవేస్తూ వుంటారు. ఇలా ఎన్ని శ్లోకాల్ని వల్లెవేస్తే అంత గొప్ప అన్నమాట. దలైలామాతో సహా దాదాపు అందరు సన్యాసులూ మాంసాహారులే. స్వయంగా ఎంతో మంది సన్యాసులతో ఐరిష్ పబ్బుల్లో కూర్చున్నానూ, మాట్లాడానూ.
ఇవన్నీ తప్పులూ అని నేను చెప్పడంలేదు. కేవలం బౌద్దం కూడా ఆచారాలను క్రతువులనూ ప్రోత్సహించే మరొక మతమే అని చెప్పడానికి ఇవన్నీ ఇక్కడ ప్రస్తావించాను. స్వయంగా దలైలామా బౌద్దాన్ని ప్రచారం చెయ్యడంకంటే జర్మనీలో వున్న తన శోదరి దగ్గరా, అలాగే యూరప్ లో వున్న శిష్యగణం దగ్గరా ఎక్కువ సమయం గడుపుతాడని మెక్లోడ్ గంజ్ లో వున్న ఎగ్జైల్ గవర్నమెంట్ ఆఫ్ టిబెట్ లోనే ఎన్నో వివాదాలున్నాయి. ఇక నేను టిబెట్ మొత్తాన్ని దాదాపు రెండు నెలలు తిరిగాను. అక్కడ దలైలామాకూ గానీ, అతను ప్రతిపాధించే బుద్దిజానికి గానీ ఎలాంటి గొప్ప పేరులేదు. చాలామంది రిపబ్లిక్ ఆఫ్ చైనాని సమర్ధిస్తూ బౌద్దాన్ని తెగడడం చూశాను. అలాగే బౌదాన్ని దానిలోని మూఢత్వాన్నీ కట్టడి చేసి చైనా చాలానే అభివృద్ధి సాధించిందని మనకందరికీ తెలుసు. మళ్ళీ ఇక్కడా నేనూ కమ్యూనిజాన్ని వెనకేసుకొస్తున్నానని పొరపాటు పడవద్దు.
ఇక క్రైస్తవానికొద్దాం. నేను విన్నదానిప్రకారం అంబేడ్కర్ గారు హైందవానికి ధిక్కారంగా క్రైస్తవ మతాన్ని శ్వీకరించడానికి కూడా కొంతా అలోచన చేశారని చదివాను. కేవలం అప్పటి పరిస్థితుల్లో పాలక శ్వేతజాతిమతమన్న కారణంగా ఆయన క్రైస్తవాన్ని దూరంపెట్టారు అంటారు. సరే నేను కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇండియాలో వున్న క్రైస్తవం గురించి చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో వున్న Roman Catholic చర్చ్ ని ఒక్కసారి చూడండి. అన్ని తెగల రెక్టార్లూ, బిషప్లూ అలాగే ఫాదర్స్ అంతా ఆధిపత్య కులాలనుండి వచ్చినవారే. ఎక్కడో అడపా దడపా ఒక్కరూ ఇద్దరు దళిత ఫాదర్స్ వున్నా వాళ్లనెప్పుడూ హైరార్కీలో పైకి వెళ్ళనివ్వరు. బిషప్పుల పేర్ల చివర రెడ్దీ, చౌధరీ తోకల్ని వదలకుండా మోస్తూ క్రైస్తవాన్ని ప్రచారం చేసే ఫాదర్లను ఎక్కడబడితే అక్కడ చూడొచ్చు. అలాగే ప్రొటెస్టెంటు చర్చ్ ని చూస్తే, చర్చీల్లో కూడా మాల చర్చ్ మాదిగ చర్చ్ అని విభజనలు ఎప్పుడో చేసి మనలో మనకు తగవులు పెట్టింది క్రైస్తవం. ఇక లోకల్ చర్చెస్ విషయానికొస్తే అన్ని ధనిక చర్చీలూ దళితేతరుల చేతుల్లోనే వున్నాయి. అత్యంత ధనవంతమైన చర్చీలుగా చెప్పబడే కల్వరి, అసెంబ్లీ ఆఫ్ గాడ్, ఇవన్నీ సతీష్ చౌధరి లేదా మోజెస్ చౌధరీల చేతుల్లోనో లేదా ఆర్ ఆర్ కే మూర్తీ అనబడే ప్రవచనకారుడి కోరల్లోనో ఎప్పుడో ఇరుక్కుపోయాయి. అడపాదడపా వీళ్ళ పెత్తనాన్ని ప్రశ్నించే దళిత క్రస్తవుల్ని పళ్ళల్లో ఇరుక్కున్న మాంసపు తునకలుగా పీకి పారెయ్యడం ప్రతీ చర్చి లోనూ చూడొచ్చు. ఈ పెద్ద పెద్ద చర్చీల్లో కులాల కుమ్ములాట లేదని నిరూపించండి ఎవరైనా!
ఒక పక్క క్రైస్తవం పాపుల రక్షణకోసం వచ్చింది అనిచెప్పుకుంటూనే చర్చీల్లో కులాంతర వివాహాలను ఇప్పటికీ నియంత్రిస్తున్నారు. అంతెందుకు మా ఇంట్లో సహా ఎన్ని దళిత కుటుంబాలు తమ కులం కాని మరొక క్రైస్తవుడికి పిల్లనో పిల్లోడ్నో ఇవ్వడానికి సిధ్ధంగా వున్నారు?
ఇక కొన్ని మెయిన్ లైన్ చర్చీల్లోనైతే ఆస్తుల గొడవల్లో పాదిరీల హత్యలే జరిగాయి. లూథరెన్ అలాగే సీ ఎస్ ఐ చెర్చీల్లో జరిగినన్ని హత్యలు సాయిబాబా ఆశ్రమంలో కూడా జరిగి వుండవు.
ఇన్ని దురాగతాలకు అడ్డాలైన చర్చీలకు వెళుతూ నెల మొదటితారీఖున దశమభాగాన్ని ( జీతంలో పదో భాగం) పవిత్రంగా కవర్లలో పెటి ఆ ఆధిపత్య కులంనుండి వచ్చిన పాదిరి చేతికిచ్చి తమ జన్మ ధన్యమైందని భావించే దళిత క్రైస్తవులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కొన్ని గ్రామీణ ప్రాంతపు చర్చీలొనైతే ప్రతీరోజు ఎసట్లోనుండి చారెడు బియ్యంతీసి ఒక ప్రత్యేక డబ్బాలో నింపి, ఆదివారం దాన్ని చర్చీకి తెచ్చి అక్కడ అయ్యగారికి సమర్పించే ఆచారాన్ని కూడా ప్రోత్సహిస్తారు. పంటలో ప్రధమ ఫలాన్నీ, పాడిలో జున్నుపాలనూ … ఒకటేంటి ,,, అన్నింట్లో అయ్యగారికి దొరుకుతుంది తేరగా వచ్చే భాగం.
మన కష్టార్జితాన్ని ఇలా నెలనెలా , వారం వారం తేరగా మెక్కుతూ మన్లో మనకే కుమ్ములాటలు పెడుతూ, అంబేడ్కర్ ఆశయమైన కుల వ్యవస్తను నిర్మూలించడానికి ఏమాత్రం సహకరించని చర్చీని, మనకు విద్యనేర్పిందనీ, వుద్యోగాలిచ్చిందనీ సమర్ధించడం పెద్ద మోసం. ఏం వుద్యోగాలిచ్చిందీ? హయ్యర్ గ్రేడ్, సెకెండరీ గ్రేడ్ పంతుళ్ళను చేసింది. సర్కార్ దవఖానాల్లో లోయర్ గ్రేడ్ స్టాఫ్ నర్సుల్నీ, వాడాయిల్నీ, వార్డు బోయిల్నీ సృష్టించింది. ఎంతమంది ఈ చర్చీ ఇచ్చిన దానంవలన గొప్ప డాక్టర్లు అయ్యారు? నిజంగా దళిత వర్గాల్లో సివిల్ సర్వీస్ ఉద్యోగాల స్థాయికి ఎదిగిన వారు క్రైస్తవేతరులే ఎక్కువ. గణాంకాలు చూడండి.
ఇక చివరిగా చెపాలనుకుందేంటంటే, అది బౌద్దం కానీ, క్రైస్తవం కానీ, మతాన్ని వదలనంతకాలం మనం ఎక్కడా అభివృధ్ధిని సాధించలేము. మతం , దేవుడు మనకున్న ప్రధమ బలహీనతలు. వీటినుండి బయటపడితే , కులంనుండి బయటపడడం శులువు. ఎందుకంటే మతం, దేవుడూ ఈరెండూ మనుషుల్లో హెచ్చు తగ్గుల్ని నాటి, పోషించి పెంచుతున్న భావాలే. ఒక్కసారి దేవుడు అనే భావజాలంనుండి బయటికి వస్తే మనకు మతం అవసరమే కనిపించదు. మతం లేదన్ననాడు హెచ్చుతగ్గుల్ని తేటగా గమనించవచ్చు. మతంపేరుతో , దేవుడి పేరుతో మనం వృధాచేసే మన కష్టార్జితన్ని మన తోటి దళిత సహోదరుల బాగుకోసం వుపయోగించవచ్చు. అసలూ క్రైస్తవులందరూ తమ దశమభాగాల్ని విధిగా తమ జాతి అభ్యున్నతికి వినియోగించడం అలవాటుచేసుకుంటే, ఇలా వూరూరా ఒక నిధిని ఏర్పాటిచేసుకుంటే మనపిల్లలు ఫీజుల్లేక ఆధిపత్యకులాల పంచల్లో చెయ్యి చాచే అగత్యమే వుండదు. ఆరోజు కంచికచెర్ల కోటేసు లాంటి జీతగాడి చావులు మనం చావాల్సిన పనిలేదు.
నా దళిత మూలవాసీ బహుజన సోదరుల్లారా, దేవుడ్ని వదలండి. మతాన్ని తన్నండి… కులంనుండి విముక్తులు కండి.

(Visited 966 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply