కడుపు మాడినా సరే ఆవు కళేబరాల్ని ముట్టుకోం’- గుజరాత్‌లో దళితులు

కడుపు మాడినా సరే ఆవు కళేబరాల్ని ముట్టుకోం’- గుజరాత్‌లో దళితులు

గుజరాత్‌లో దళితులు ఇప్పుడు ఒక కొత్త ‘మోడల్‌’ను ముందుకు తెచ్చారు. ఆవుల మృత కళేబరాలను తరలించడానికి వారు ససేమిరా అంటున్నారు. ఈ నెల 11న ఉనాలో ఆవుల మృత కళేబరాలను తరలిస్తున్న నలుగురు దళిత యువకులను ‘గోరక్షక్‌’ మూకలు తీవ్రంగా కొట్టిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా దళితులలో నిరసన మొదలైంది. తాజాగా తలపై బ్యాండేజీతో ఉన్న చిరాగ్‌ దశరథ్‌భారు పర్మార్‌ ఫోటో గుజరాత్‌లో కులహింసకు వ్యతిరేకంగా దళితుల నిరసనోద్యమానికి ప్రతీకగా మారింది. గాంధీనగర్‌ జిల్లా నివాసి అయిన చిరాగ్‌ చనిపోయిన పశువును తరలించడానికి నిరాకరించినందుకు భూస్వామ్య వర్గాలకు చెందిన చౌధరి కులస్తులు తీవ్రంగా కొట్టారు. ఉనా సంఘటనకు నిరసనగా గత వారం జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయనపై ఈ దాడి జరగడం గమనార్హం. చిరాగ్‌ తిరుగుబాటు ఇప్పుడు గుజరాత్‌లోని ‘చరమ్‌కార్‌’ సముదాయానికి ప్రేరణగా ఉంది. గుజరాత్‌లోని దళిత కులాల్లో రెండో అతి పెద్ద కులం ‘చరమ్‌కార్‌’లదే. తరతరాలుగా చనిపోయిన పశువుల చర్మాల్ని వొలుస్తూ, చర్మ పరిశ్రమలో పని చేస్తూ జీవించే ‘చరమ్‌కార్‌’లు ఇప్పుడు ‘ఆ పని చెయ్యబోమ’ని తెగేసి చెబుతున్నారు.
చిరాగ్‌ నిరసన ఇప్పుడు విస్తృతమైంది. మితభాషి చిరాగ్‌ తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఉనా సంఘటన చిరాగ్‌ను పూర్తిగా మార్చివేసింది. దేశవ్యాప్తంగా మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచిన ఆ అత్యాచార సంఘటన దళిత ప్రతిఘటనకు ఒక కొత్త ఊపునిచ్చింది. దళితులు తరతరాలుగా అంటరానితనం, వివక్ష, బహిష్కరణ వంటి రూపాల్లో సామాజిక అణచివేతను అనుభవిస్తూనే చనిపోయిన పశువుల చర్మం వొలిచే వృత్తిని వారసత్వంగా కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఆవు పేరుతో జరుగుతున్న ఉన్మాద దాడులతో ఇప్పుడు ఆ వృత్తే వారికి ప్రాణ సంకటంగా మారుతోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న గోరక్షణ సంస్థల సభ్యులు చేతుల్లో కత్తులతో, లాఠీలతో వీర విహారం చేస్తున్నారని దళిత సముదాయ నేత హీరాభారు చావడా అన్నారు. ‘వారు మమ్మల్ని ఎక్కడ బడితే అక్కడ అడ్డుకుంటారు. మా నుంచి డబ్బు లాక్కుంటారు. మమ్మల్ని కొడతారు. అయినా పోలీసులు వారినేమీ అనరు’ అని ఆయన చెప్పారు.
ఉనా సంఘటన తర్వాత వారిక ఈ పనిని చేయగూడదని నిర్ణయించుకున్నారు. ‘మేమిక చనిపోయిన పశువులను తొలగించం. ఆకలితో మా కడుపులు మాడినా సరే ఇక మేం వాటి చర్మాలను తీయబోం’ అని హీరాభారు అన్నారు. ఈ నిరసనలు శాంతియుతంగా, యాదృచ్ఛికంగా, నాటకీయంగా మొదలయ్యాయి. గత 18న ఉనా సంఘటనకు నిరసనగా సురేంద్రనగర్‌ జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయంలో మృత పశువుల కళేబరాల్ని పడవేసి దళితులు ఈ కొత్త తరహా నిరసన పోరాటానికి తెరలేపారు. ‘నవ సర్జన్‌ ట్రస్ట్‌’కు చెందిన నటూభారు పర్మార్‌ నాయకత్వంలో దళితులు ఆరు వాహనాల్లో చనిపోయిన పశువులను తీసుకొని వెళ్లి కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో పడవేశారు.
ఈ సంఘటనతో పాలనా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఎందుకంటే శతాబ్దాలుగా ఈ పనికి ప్రత్యేకించబడ్డ మనుషులు ఇప్పుడు మేం ఆ పనిని చేయం అని చెబుతున్నారు. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే చనిపోయిన పశువుల్ని తొలగించేందుకు మనుషులే కరవయ్యారు. తమ ఇంటి ముందు చనిపోయిన ఒక ఆవు కళేబరం మూడు రోజులుగా అక్కడే ఉందంటూ సురేంద్రనగర్‌ వాసి అయిన వర్షాబేన్‌ వాపోయారు. దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాల్సిందిగా ‘చరమ్‌కార్‌ కుర్రాళ్లకు’ ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా వారు కట్‌ చేస్తున్నారని ఆమె తెలిపారు.
ఈ దళిత ప్రతిఘటన రాష్ట్రంలో పలు సమీకరణాలను తారుమారు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనిదని గుజరాత్‌ రాజకీయాల్లో కుల సమీకరణాలను చాలా కాలంగా అధ్యయనం చేస్తున్న అచ్యుత్‌ యాజ్ఞిక్‌ అన్నారు. ‘సౌరాష్ట్రలో మొదటిసారిగా దళిత ఉప కులాలన్నీ ఏకమయ్యాయి. నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి’ అని ఆయన చెప్పారు.

(Visited 661 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply