కుసుమ ధర్మన్న సాహిత్య పీఠం- ‘సాహితీ సమాలోచన’ సభలో వక్తల డిమాండ్‌

కుసుమ ధర్మన్న సాహిత్య పీఠం- ‘సాహితీ సమాలోచన’ సభలో వక్తల డిమాండ్‌

మరుగునపడిన కుసుమ ధర్మన్న సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆయన పేర తెలుగు యూనివర్శిటీల్లో సాహిత్య పీఠం ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రామచంద్రరావు ఛాంబర్‌ హాల్లో ఆదివారం నిర్వహించిన ‘కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచన’ సభలో పలువురు మాట్లాడారు. తొలుత బొజ్జా తారకం మృతికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. అనంతరం పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ.. కుసుమ ధర్మన్న సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపితే అందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మన్న సాహిత్యం, రచనలపై పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ధర్మన్న రాసిన ‘మాకొద్దీ నల్లదొరతనం’ గీతాన్ని జాతీయగీతం మాదిరిగా విద్యార్థులు ఆలపిస్తే నల్లదొరతనాన్ని పోగొట్టాలనే ఆలోచన వారిలో వస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచన ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఇ.విజయపాల్‌ మాట్లాడుతూ కవులు, రచయితలు, పరిశోధకులు, మేధావులతో చర్చించి కుసుమ ధర్మన్న సాహితీ పీఠం ఏర్పాటుపై తీర్మానం చేస్తామని చెప్పారు. భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ ధర్మన్న మనుషులంతా అన్నదమ్ములేనని చాటి చెప్పారన్నారు. ఎంఎల్‌సి రాము సూర్యారావు మాట్లాడుతూ.. కుసుమ ధర్మన్న తన రచనల ద్వారా మనలో బతికే ఉన్నారని చెప్పారు. దళిత సంఘాల నాయకులు విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం కాక దళితులు చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేయాలన్నారు. మాజీ ఎంపీ బివిజి శంకరరావు మాట్లాడుతూ.. ధర్మన్న రచనలు భావితరాలకు మార్గదర్శకం కావాలన్నారు. ఈ సభలో కుసుమ ధర్మన్న మనుమరాలు రాజకుమారి, మనుమడు ప్రసాద్‌, కోడలు అమ్మాజీ, ధర్మన్న సహచరుడు, మాజీ ఎంఎల్‌ఎ చిట్టూరి ప్రభాకర చౌదరి, రచయితలు కోయి కోటేశ్వరరావు, పుట్ల హేమలత, ఎండ్లూరి సుధాకర్‌, టి.సత్యనారాయణ, జి.సుబ్బారావు, గూటం స్వామి, సన్నిధానం నరసింహశర్మ, శిఖామణి, జివి.రత్నాకర్‌, శ్యామ్‌సన్‌, వేముల ఎల్లయ్య, ప్రజాశక్తి బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్‌ లక్ష్మయ్య, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రూపస్‌రావు, మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, జెవివి రాష్ట్ర అధ్యక్షుడు చల్లా రవికుమార్‌, అక్నూ ప్రొఫెసర్‌ సురేష్‌, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్‌ నిఖిలం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు, పరిశోధకులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ధర్మన్న రచనలు భావితరాలకు అందించాలి
అనంతరం ‘కుసుమ ధర్మన్న-సామాజిక సాహిత్య నేపథ్యం’ అనే అంశంపై జరిగిన సదస్సు జరిగింది. నాడు అట్టడుగు వర్గాలపై అసమానతలను ధిక్కరిస్తూ అగ్రకుల దురహంకారాన్ని ప్రతిఘటిస్తూ అక్షర అస్త్రాల్ని సంధించిన కుసుమ ధర్మన్న నేపథ్యాన్ని తవ్వి తీసి ఆయన జీవిత విశేషాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లి రవి మాట్లాడుతూ నన్నయ్య, ఆరుద్ర వంటి మహాకవులతోపాటు ధర్మన్న కూడా రాజమహేంద్రవరంలో జన్మించినా ఆయన రచనలు, స్ఫూర్తి మరుగున పడిపోయాయన్నారు. తెల్లదొరతనంతోపాటు నల్లదొరతనం కూడా వద్దని ధర్మన్న చెప్పారన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎండ్లూరి సుధాకర్‌ మాట్లాడుతూ పత్రిక, సాహిత్య, సామాజిక రంగాలతోపాటు వైద్యునిగా ధర్మన్న సేవలందించారన్నారు. ప్రముఖ విమర్శక కవి శిఖామణి మాట్లాడుతూ ధర్మన్న రచనలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు కుసుమాంజలి నిర్వహించడం ధర్మన్న పాదానికి తొడిగిన స్వర్ణకంకణంగా భావిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో కుసుమ ధర్మన్న మనవరాలు రాజకుమారి ప్రసంగించారు. జివి.రత్నాకర్‌, వేముల ఎల్లయ్య, సన్నిధానం నరసింహశర్మ, శ్యాంషా, గూటం స్వామి, మద్దుకూరి సత్యనారాయణ తమ సందేశాలు వినిపించారు. అనంతరం ‘దళితులు-వర్తమానం-కుసుమ ధర్మన్న’ అంశంపై నిర్వహించిన సదస్సుకు ప్రముఖ కవి జి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. సుబ్బారావు మాట్లాడుతూ ధర్మన్న రచనలు అధర్మానికి బలై మరుగునపడ్డాయని అన్నారు. మేడిపల్లి రవికుమార్‌ మాట్లాడుతూ దళిత కవి మాత్రమే కాదని జాతీయ కవి అని అన్నారు. ఇతర కవులకు ధీటుగా రచనలు చేశారని అన్నారు. కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ దళిత, బహుజన, వామపక్ష తాత్వికవేత్తలు ఏకం కావాలని కోరారు. భీమపక్ష, వామపక్షవాదుల ప్రేమ సంగమంగా ఈ సదస్సును అభివర్ణించారు. ఆశాజ్యోతి మాట్లాడుతూ ధర్మన్న మత పోకడలకు వ్యతిరేకంగా రచనలు చేశారని అన్నారు. పుట్ల హేమలత మాట్లాడుతూ 70 ఏళ్ల క్రితం అలుపెరుగని యోధుడిగా ధర్మన్న సేవలను వెలుగులోకి తెచ్చిన ప్రజాశక్తి పత్రికకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ధర్మన్న విగ్రహం ఏర్పాటుచేయాలన్నారు. కె.గౌరేశ్వరరావు మాట్లాడుతూ జయభేరి పత్రిక ద్వారా ధర్మన్న దళితులను మేల్కొలిపారని అన్నారు. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వర్యాన ప్రదర్శించిన కుసుమ ధర్మన్న జీవితం, సాహిత్యంపై నృత్య రూపకాలు, గేయాలాపన సభికులను ఆలోచింపజేశాయి.
ధర్మన్న రచనల ఆవిష్కరణ
దళిత కవి కుసుమ ధర్మన్న రచించిన, ఆయనపై పరిశోధించిన ఏడు రచనలను ప్రజాశక్తి బుకహేౌస్‌ ముద్రించింది. ప్రముఖ రచయిత, విశ్లేషకులు తెలకపల్లి రవి ఆ రచనలను విశ్లేషించారు. ఒఎన్‌జిసి చమురు సహజ వాయువులను వెలికి తీస్తున్న విధంగా ధర్మన్న రచనలు, సాహిత్యాన్ని వెలికి తీయాలన్నారు. 1.మాకొద్దీ నల్లదొరతనం, 2.హరిజన శతకం, 3.సామ్యవాదాన్ని సహించని హిందూయిజం. 4.మద్యపాన నిషేధం, 5.తొలి దళిత స్ఫూర్తి కుసుమ ధర్మన్న (వ్యాస సంకలనం) 6.కుసుమ ధర్మన్న రచనలు-దళిత దృక్ఫథం (డాక్టర్‌ మద్దూకూరి సత్యనారాయణ) 7.కుసుమ ధర్మన్న జీవిత ప్రస్థానం (డాక్టర్‌ పుట్ల హేమలత) రచనలను సభలో ఆవిష్కరించారు. శిఖామణి సంపాదకత్వాన వస్తున్న ద్వైమాసిక సాహితీ పత్రిక కవిసంధ్యను కూడా ఆవిష్కరించారు. ప్రజానాట్య మండలి రూపొందించిన కుసుమ ధర్మన్న పద్యాలు, పాటల సిడిని కూడా ఆవిష్కరించారు.
source:
http://www.prajasakti.com/Article/AndhraPradesh/1843878

(Visited 108 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply