శ్రమైక జీవనంలో ఏ కులమెంత? – కంచ ఐలయ్య

శ్రమైక జీవనంలో ఏ కులమెంత? – కంచ ఐలయ్య

మానవ జీవన ప్రక్రియకు ప్రధానశక్తి అయిన ఆహార ఉత్పత్తి, పశుపోషణ, శాస్త్రీ‌య అభివృత్తులను అంచనా వేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలని నాకు తెలుసు. తిట్టే సంస్కృతికి ‘షఫర్డు’ ఎల్లప్పుడు దూరమున్నాడు. ఇతరులను చంపడానికి ఏనాడు నా జాతి కర్రెత్తలేదు. అందుకే గర్వంగా అంటున్నా నేను షఫర్డునని.

మానవ జీవన ప్రక్రియకు ప్రధానశక్తి అయిన ఆహార ఉత్పత్తి, పశుపోషణ, శాస్త్రీ‌య అభివృత్తులను అంచనా వేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలని నాకు తెలుసు. తిట్టే సంస్కృతికి ‘షఫర్డు’ ఎల్లప్పుడు దూరమున్నాడు. ఇతరులను చంపడానికి ఏనాడు నా జాతి కర్రెత్తలేదు. అందుకే గర్వంగా అంటున్నా నేను షఫర్డునని.

ఈ వ్యాసం అసలు అంశాన్ని చర్చించేముందు నేను పేరు మార్చుకున్న సందర్భాన్ని చెప్పాలి. మే 14న విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర సదస్సు జరిగింది. అందులో శ్రామికుడు/శ్రామికురాలు సింధు నాగరికతలో మట్టిని ఇటుకగా మార్చడంలో, కర్రను ఇంటిగా మార్చడంలో, ఇండ్లు కట్టడంలో, ఇనుమును కరిగించే పని చేయడంలో పుట్టాడు/పుట్టింది అని ప్రారంభించి కొంత చరిత్రను తడిమాను. వేదకాలం దాకా ఆ శ్రామిక ప్రక్రియ క్రమంగా అభివృద్ధి చెందింది. కానీ వేదకాలం నుంచి శ్రమ గౌరవం అడ్డం తిప్పబడింది. ఆ కాలమంతా ఆధిపత్యం బ్రాహ్మణుల చేతుల్లో ఉండింది. ఈ రచనా కాలమంతా శ్రమ వ్యతిరేక విలువల్ని పెంచారు. తిరిగి గౌతమ బుద్ధుడు రంగం మీదికి వచ్చాక బ్రాహ్మణ వర్సెస్‌ శ్రమణ సంఘర్షణ జరిగింది. ఆ తరువాత బుద్ధిజాన్ని బలహీనపర్చాక బ్రాహ్మణిజం తిరిగి ఆధిక్యతలోకి వచ్చింది అని సాగింది నా ఉపన్యాసం.
తరువాత వివిధ దశలు దాటిన మన సమాజంలో ప్రధాన ఉత్పత్తి రంగంలో బ్రాహ్మణుల పాత్ర లేదు. ఉత్పత్తి రంగంలో అతి కీలకమైంది బురుద నుంచి బువ్వకు కావాల్సిన పంటలను పండించడం. ఆ మౌలిక ఉత్పత్తిలో వారి పాత్ర కనిపించడం లేదు. అంటే మార్క్సిస్టు పరిభాషలో పునాది ఉత్పత్తి రంగంలో వారి కంట్రిబ్యూషన్‌ లేదు అని నా వాదన. ఇది కొన్ని పత్రికల్లో వేరే రకంగా వచ్చింది. ఆ తరువాత రెండురాష్ట్రాల బ్రాహ్మణ సంఘాలు చాలా గొడవ చేశాయి. చాలా చోట్ల మే 15, 16 తేదీల్లో నా దిష్టి బొమ్మలు తగులబెట్టారు.

మే 15న ఒంగోలు బ్రాహ్మణ సంఘాల సభలో మాజీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య కార్యదర్శి, ప్రస్తుత బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వై. కృష్ణారావు నా ఉపన్యాసాన్ని ఖండించారని తెలిసింది. మే 16 మధ్యాహ్నం ఒక బ్రాహ్మణ సంఘం సభ్యుడు నాకు ఫోన్‌ చేసి మేం కృష్ణారావుగారి ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని నాతో కలవాలన్నారు. వారిని నేను రమ్మన్నాను. వారి సమక్షంలోనే నేను ఏం మాట్లాడానో వారితో వచ్చిన టీవీ చానెళ్ళకి చెప్పాను. వారు వెళ్లిపోయిన గంట తరువాత నా ఆఫీసుకు వరుసగా ఫోన్లు రావడం మొదలైంది. ‘ఐలిగాడున్నాడా’ అనేది వారి మొదటి ప్రశ్న. ‘పరశురామ గండ్రగొడ్డలి సంగతి తెలుసా’ అని ఒకతను. వారిదొక బూతుల పంచాంగమని మాత్రమే నేను చెప్పగలను. వీళ్ళే ఇప్పుడు సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషనులో నాపై కేసు కూడా పెట్టినట్టు వార్తలొచ్చాయి.

ఈ క్రమంలో మే 21 నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మేధావుల సదస్సులో ‘ఓ భారతీయ బ్రాహ్మన్స్‌’ కవితలో పేరు మార్పు ప్రకటన చేసాను. కులం నుంచి బయటపడి నా ఉత్పత్తి మూలాల ఇంగ్లీషు పేరుతో ప్రపంచానికి చాటి, ఐలిగాడు ఇక షఫర్డ్‌ అయ్యాడు. షఫర్డ్‌ అనే ఇంగ్లీషు పదం కేవలం గొర్రెల కాపరితనాన్ని మాత్రమే తెలియజేయదు. అది ‘సమానత్వ దేవుణ్ని’ (గాడ్‌ ఆఫ్‌ ఈక్వాలిటీ) ఆరాధించే మానవ మంచితనానికి కూడా ప్రతీక. (నా పూర్తి వివరణను ‘Scroll.inలో ఎవరైనా చూడవచ్చు.)

సామాజిక శాస్త్ర పరిశోధనా రంగంలో అన్ని కులాలపై పరిశోధన జరుగుతుంది. ఐతే ఉత్పత్తి రంగంలో ఏ కులం పాత్ర ఏమిటనేది అంత కీలకమైన అంశంగా ముందుకు రాలేదు. కింది కులాల అణచివేత, వారి మార్పు గురించిన చర్చ ఈ మధ్య కాలంలో కొంత జరిగింది. జరుగుతూ ఉంది. కానీ వ్యవస్థ నిర్మాణానికి, అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ పునాదిగా ఉంటుందనేవారు కూడా అసలు ఆహారోత్పత్తి, ప్రకియ్రలో ఏ కులం పాత్ర ఎంత ఉన్నది అనేది చెప్పలేదు. కులం సామాజిక హోదా దాని మౌలిక ఉత్పత్తి శ్రమతో ముడేసి చూడాలనేది నా వాదన. ఈ ప్రశ్న లేవనెత్తాను కనుక నన్ను చంపితేనో, జైల్లో పెడితోనో దేశం బాగు పడదు. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఆధునిక రీసెర్చిని అడ్వాన్స్‌ చేయాలి. తిట్ల పురాణాలు ఎన్ని రాసినా ఫలితం ఉండదు. ప్రశ్న చావదు. ఆదిమ దశలో ఉత్పత్తి పని ఎక్కడ ప్రారంభమైంది? అడవులు నరికి భూముల్ని మైదాన ప్రాంతాలుగా మార్చడంతో మొదలయింది. సింధూ నాగరికత నాడు మనుషుల ఆహారం జంతు వేట, పండ్లు, చేపలు తెచ్చుకొని తినడంతో నడిచేది. కానీ శ్రమ చిన్న పట్టణం-లేదా గ్రామ నిర్మాణానికి మెదడు ప్రక్రియను అడ్వాన్సు చేసి ఇటుక చేశారు, ఇల్లు కట్టారు. కాలువలు కూడా తవ్వారు. ఇనుమును కొద్దో గొప్పో కరిగించారు. ఆనాటికి దేశంలో వర్ణవ్యవస్థకానీ, కుల వ్యవస్థకానీ లేవు.

ఐతే చెట్లు నరికి విశాల పంట భూములుగా భారత దేశాన్ని మార్చిన ప్రక్రియ బుద్ధిస్టు విప్లవం వచ్చాక మొదలైంది. అంతకుముందు కొద్దో గొప్పో పోడు వ్యవసాయం మాత్రమే ఉండింది. ఈ దశలో బ్రాహ్మణ కులం సంపూర్ణంగా రూపొందిందని జాతక సాహిత్యం స్పష్టంగా చెబుతుంది. ఆ పునాది వ్యవసాయ ప్రక్రియలో వారు పాల్గొన్న దాఖలాలు ఎక్కడాలేవు. ఆ తరువాత ధాన్యం పండించడం దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రారంభమైంది. జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రజలకు పశు మాంసం, ప్రకృతి వనరుల పండ్లు, కాయగడ్డల సంపద సరిపోయేది కాదు. అందుకని భూమి నుంచి బువ్వ పుట్టించడం అనే విప్లవాత్మక ప్రక్రియను ఆనాటి శూద్ర, చండాల, ఆదివాసులు చేశారని నా భావన. ఈ ఉత్పత్తి ప్రక్రియను బుద్ధుని సమకాలీన బ్రాహ్మణశక్తులు తీవ్రంగా ఎదుర్కొన్న ఆధారాలున్నాయి. బ్రాహ్మణులు ఆనాటి శ్రమణులందర్ని మ్లేచ్ఛులుగా వర్ణించిన ఆధారాలున్నాయి.

ఈ ఉత్పత్తి అనుకూల, ఉత్పత్తి వ్యతిరేక పోరాటాల్లో రాజులు ఏంచేశారు? ఎవరి వైపు ఉన్నారు అనేది చూస్తే, బుద్ధునికి కలిసొచ్చిన అంశాలున్నాయి. తన సమకాలంలో అతి పెద్ద రాజైన బింబిసారుడు ఆయన వ్యవసాయ విప్లవ మద్దతుదారుడయ్యాడు. ఆ తరువాత వచ్చిన నందరాజులు వ్యవసాయ అభివృద్ధికి సహకరించారు. కౌటిల్యుడు వారిపై తిరగబడడానికి అసలు కారణం అది. ఆయన చంద్రగుప్త మౌర్యుడిని అధికారంలోకి తెచ్చి ఈ ఉత్పత్తి ప్రక్రియను ఆపేయమని, ఆదివాసులను అన్ని రకాల హత్యాకాండల ద్వారా లొంగదీసుకొమ్మని బలవంతపెట్టాడు. దానికి చంద్రగుప్త మౌర్యుడు అంగీకరించనందువల్ల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి తనపేరుతో ‘అర్థశాస్త్రం’ -నిజానికి ‘యుద్ధ శాసా్త్రన్ని’ రాసాడు. ఆ పుస్తక ప్రభావంతో బ్రాహ్మణీయ భావజాలం బలపడింది. తిరిగి అశోకుడు బుద్ధిజాన్ని తీసుకొని ఆదిమసంక్షేమ రాజ్యం స్థాపించే వరకు వ్యవసాయ ఉత్పత్తి బాగా వెనుక పట్టుబట్టింది. విచిత్రమేమంటే ఇప్పుడు నడుస్తున్న బ్రాహ్మణ వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ ‘కౌటిల్య స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. నిజానికి కౌటిల్యునినుంచి మొదలుకొని స్వాతంత్య్రం వచ్చేవరకు పెట్టుబడిదారీ వ్యవస్థను సపోర్టు చేస్తూ రాసిన బ్రాహ్మడు ఎవడూ లేడు. ఆ ఘనత బ్రాహ్మణిజం బయట బతికిన జవహర్‌లాల్‌ నెహ్రూకు దక్కుతుంది. ఆయన పుట్టుకతో బ్రాహ్మణ్‌ అయినా దాన్ని ఏ రూపంలోనూ పాటించలేదు. ముస్లిం రాజులు, బ్రిటిష్‌ వలసవాద పరిపాలన ఉన్నంత కాలం బ్రాహ్మణులు తమ ఆధ్యాత్మికరంగాన్ని కాపాడుకోవడానికి దాదాపు అండర్‌గ్రౌండ్‌లో పనిచేశారు. అప్పుడు కూడా ఉత్పత్తిరంగంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఐనా ఇస్లాం శ్రమ గౌరవ, కులాతీత ఆధ్యాత్మిక ప్రచారానికి ప్రభావితమై ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా వంటి ఆసియా ఖండ ప్రాంతాలు ఇస్లాంకు మారాయి. అందులోకి మారిన వాళ్ళంతా ఉత్పత్తి కులాలవాళ్ళు.

స్వాతంత్య్రం వచ్చాక బ్రాహ్మణులు ఆధ్యాత్మిక రంగం, విద్యారంగం, రాజకీయ రంగం, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ రంగాల్లో పనిచేశారు. చేస్తున్నారు. వీటికి తోడు రచనారంగం వారి చేతిలోనే ఉంది. 1970 దశకంలో దళిత రచన ఉద్యమం వచ్చే వరకు ఏ రంగాలలో చూసినా బ్రాహ్మణులే ఆధిపత్యం గల రచయితలుగా ఉన్నారు. ఇప్పుడు మీడియా రంగంలో వాళ్ళు అగ్రభాగాన్ని కలిగి ఉన్నారు. శూద్ర అగ్రకులాల వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో మీడియా ఓనర్లుగా ఉన్నప్పటికీ దాని అక్షర ఆధిపత్యం బ్రాహ్మణ మేధావులదే. ఇంగ్లిష్‌ మీడియా పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. మొదలు సంస్కృతం, ఆ తరువాత పర్షియన్‌ భాష, ఆ తరువాత ప్రాంతీయ భాషలు (అన్నీ బాగా సంస్కృతీకరించబడ్డవే), ఇప్పుడు ఇంగ్లీషు భాషా రంగమంతా వారి చేతిలోనే ఉంది.

అయితే ఇవన్నీ ఉపరితల పనులే. ఇప్పుడు-మన జీవిత కాలంలో-ఉత్తరాఖండ్‌లో కొంత మంది బ్రాహ్మణులు తప్ప రోజువారి నాగలి దున్నడం, పశువులు కాయడం, పంటలు వేయడం, కాయడం పనుల్లో వాళ్ళు లేరు. మౌలిక ఉత్పత్తి రంగాల్లో పనిచేసే టిల్లర్లను, షఫర్డులను, కాబ్లర్లను, పాటర్లను, స్మితలను (ఇంగ్లీషులో భాష ద్వారా కులాలను ముడెయ్యడం సులభం) వీరు నడిపే ఉపరితల రంగాల్లోకి రానిచ్చారా? వారి పనికీ, తిండికీ, బట్టకు గౌరప్రదమైన స్థానం కలిపించగలిగారా? అసలు పునాది రంగంలో రెండువేల ఐదు వందల ఏండ్లుగా ఎన్నడూ పని చేసిన అనుభవం లేని వాళ్ళు ఆ రంగాల్లో మార్పులు తేవడానికి ఎంత పనికొస్తారు? అనే ప్రశ్నలు చైనా, యూరపు, అమెరికా దేశాలను తట్టుకోగలిగే అభివృద్ధి సాధించడానికి చాలా అవసరం. మీరు ఏ రంగంలో చూసినా మహాత్మ ఫూలే, అంబేడ్కర్‌, ఇప్పుడు మా తరం దళిత బహుజనులం రాసిన రాతలు తప్ప నిరంతరంగా, శ్రమకు ముడిపెట్టి రాసిన రాతలు కమ్యూనిస్టు ఉద్యమాల్లో మాత్రం ఎందుకు రాలేదు? ఆ ఉద్యమాల్లో సైతం ఎవరు చేతగాళ్ళు? ఎవరు రాతగాళ్ళు?

ఒకనాడు అడవులు నరికి భూమిని వ్యవసాయానుకూలంగా తయారుచేస్తున్నపుడు వంటకు కుండ, నరకడానికి గొడ్డలి, ప్రకృతి నుంచి రక్షణకు తోలుచెప్పులు, తోలుగుడ్డలు తయారు చేసింది ఈనాడు ఉత్పత్తికులాల్లో బతుకుతున్నవాళ్ళే కదా! భూముల తయారీకి, తోలు ప్రక్రియకు, కుండ చేతకు, మాలి నేతకు బ్రాహ్మణ పండితులు డిజైనులు గట్టి పనిపాఠాలు నేర్పిన చారిత్రక ఆధారాలైతే లేవు. అలా ఉంటే చరిత్రంతా బ్రాహ్మణ మేధావులే రాసినపుడు ఆ ఉత్పత్తి మిత్రబంధం గురించి ఎందుకు రాయలేదు? అసలు బ్రాహ్మణ పూజారికి, ఉత్పత్తికులాలకూ మధ్య సంబంధం విడగొట్టింది ఏ పండితులు? మీ తిండి మాంసాహారం, మా తిండి శాకాహారం అని గీతలు గీసిందెవరు? ఒక్క కుటుంబంలో పదివృత్తులు కలిగిన పదిమంది కలిసి జీవించలేని సిద్ధాంతాలు అల్లిందెవరు?

నాకు వ్యతిరేకంగా బ్రాహ్మణ సమీకరణ చేస్తున్న ఒక పెద్దాయన ‘ఉత్తరప్రదేశ్‌లో లాగా దళిత బహుజనులు, బ్రాహ్మలు కలసి రాజ్యాధికారం తెచ్చుకోకుండా శూద్ర అగ్ర కులాలు కుట్ర చేస్తున్నాయి. గమనించండి’ అన్నాడు. తెలుగు రాషా్ట్రల్లో శూద్ర అగ్రకులాల్లో ప్రధానంగా కమ్మలు, రెడ్లు, కాపులు, వెలమలు ఉన్నారు. వీరిలో ఈనాటికీ ఉత్పత్తి సంబంధాలు పంటవేసి, పంటకోసే సంబంధాలు ఉన్నాయా లేవా? ఈనాటికీ అరక దున్నే కమ్మలు, రెడ్లు, కాపులు ఎంతమంది, బ్రాహ్మణులు ఎంతమంది లెక్కలు తీద్దామా? అసలు ఉత్తరప్రదేశ్‌లో ఆ ప్రయోగం చేసి మాయావతి దళిత బహుజనుల కొంప ముంచింది. అది ఇక్కడెందుకు?
అంతేకాదు, చరిత్రలో కోమట్లు కూడా పశుపోషణ, వ్యవసాయం చేసిన ఆధారం ఉంది. గుప్తరాజుల పరిపాలన తర్వాత (వాళ్ళు కోమట్లు కనుక) వారు వ్యాపారం, రాజరికం, ఉద్యోగం రంగంలోకి మారిపోయారు. ఈనాటికీ కోమట్లలో పారిశామ్రిక వేత్తలు ఉన్నా దేశ మానసిక స్థితిని శ్రమ గౌరవ వ్యతిరేకతను పెద్దగా ప్రచారం చెయ్యగల మేధావి వర్గం వాళ్ళలో లేదు. కనుక మానవ జీవన ప్రక్రియకు ప్రధానశక్తి అయిన ఆహార ఉత్పత్తి, పశుపోషణ, శాసీ్త్రయ అభివృత్తులను అంచనా వేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలని నాకు తెలుసు. తిట్టే సంస్కృతికి ‘షఫర్డు’ ఎల్లప్పుడు దూరమున్నాడు. ఇతరులను చంపడానికి ఏనాడు నా జాతి కర్రెత్తలేదు. అందుకే గర్వంగా అంటున్నా నేను షఫర్డునని.

ఐతే ఇప్పుడు దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని కుల సంఘాలకు నాయకత్వం పుట్టుకొచ్చింది. ఆదివాసి నుంచి మాదిగ నుంచి బ్రాహ్మణుల వరకు కుల సంఘాలు రావడం మంచి పరిణామమే. ఈ దేశ అభివృద్ధిలో ఏ కులం శ్రమ ఎంత ఉన్నదో, ఎవరి వాటా ఎంతో తేల్చుకోవడం కూడా ఈ దశ కర్తవ్యం. చాలామంది దళిత బహుజనులు బుద్ధుడు, ఫూలే, అంబేడ్కర్‌ మా పోరాట సింబల్స్‌ అంటున్నారు. యాదవులు శ్రీ కృష్ణుడు తమ పోరాట సింబల్‌ అంటున్నారు. బ్రాహ్మణులు గండ్రగొడ్డలి భుజాన ఉన్న పరశురాముడు మా పోరాట సింబల్‌ అంటున్నారు. ఇందులో ఎవరు హింసావాదులో ఎవరు అహింసావాదులో చూసే వాళ్ళే చెప్పాలి. నాది మాత్రం కలం పోరాటం. కత్తి పోరాటం కాదు. గొడ్డలి పోరాటం అంతకన్నా కాదు.
కంచ ఐలయ్య షఫర్డ్‌
రచయిత, సామాజిక శాస్త్రవేత్త
sOURCE: http://www.andhrajyothy.com/Artical?SID=250972

(Visited 273 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply