గుజరాత్ : ఉనాలో దళితులు గర్జించారు. గుజరాత్‌లో చనిపోయిన పశువుల తోలు తీయడం లాంటి పనులు చేయరాదని శపథం చేశారు. ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత్-ముస్లిం భాయ్..భాయ్‌ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్‌ ఉనాలోని హెచ్‌ డి షా స్కూల్‌ దళితుల ఐక్యతకు వేదికైంది. హెచ్‌సియులో ఆత్మహత్యకు పాల్పడ్డ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధికకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌తో పాటు వేలాదిగా దళితులు, మైనరీటీలు హాజరయ్యారు. ప్రధాని మోది చెప్పిన గుజరాత్‌ అభివృద్ధి అంతా బూటకమని తేలిపోయిందని కన్హయ్య అన్నారు.

పలు డిమాండ్స్..
దళితులు ఇకపై పశువుల కళేబరాలు తొలగించడం, మృతి చెందిన పశువుల తోలు తీయడం లాంటి పనులు చేయరాదని సభ శపథం చేసింది. ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. నెలరోజుల్లోగా తమ డిమాండ్‌ నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా రైలు రోకో ఆందోళనకు దిగుతామని ఉనా సభ హెచ్చరించింది. దళితులపై దాడులు చేయొద్దు…తనని చంపండంటూ ఇటీవల మోది చేసిన ప్రకటన ఓ నాటకమని దళిత నేత జిగ్నేశ్‌ మేవాని అభిప్రాయపడ్డారు.

గుజరాత్ లో 8 శాతం దళితులు…
10 వేల మంది ఈ సభలో అత్యాచారాలను సహించేది లేదని దళిత్-ముస్లిం భాయ్..భాయ్‌ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా తృతీయ పక్షాన్ని ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైందని సభకు వచ్చిన దళిత ముస్లిం యువకులు అభిప్రాయ పడ్డారు. గోసంరక్షణ పేరిట గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా దళితులుపై మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాద్రీలో అఖ్లాక్‌ హత్య, గత నెల ఉనాలో నలుగురు దళిత యువకులను కట్టేసి కొట్టిన ఘటనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గుజరాత్‌లో దళితులు, ముస్లింలపై దాడులు జరగడం వల్లే వారంతా ఏకమైనట్లు డాక్యుమెంటరీ సినిమా దర్శకుడు ఆనంద్‌ పట్‌వర్ధన్‌ అభిప్రాయపడ్డారు. ఉనాలో దళితులపై అత్యాచారం తర్వాత గుజరాత్‌లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి సిఎం పదవి నుంచి ఆనందిబెన్‌ పటేల్‌ను తప్పించింది. గుజరాత్‌లో 8 శాతం దళితులున్నారు.

SOURCE: http://10tv.in/Dalit-stages-Protest-at-Una-in-Gujarat-58836

(Visited 37 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply