మతమా..?? కులమా..??

మతమా..?? కులమా..??

కులచర్చలు అంత తొందరగా తెగేవీకాదు అంగీకారాత్మక నిర్ణయాలకు వచ్చేవీ కావు.అవి మన సామాజిక మనుగడనూ, ఆలోచననూ problamatize చేసి కొత్త సమీకరణాల్ని తయారుచెయ్యడానికేతప్ప సమస్యల్ని తీర్చడానికి ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఇప్పట్లో అలా ఉపయోగపడే పరిస్థితీ కనిపించడం లేదు.

హిందూ మతస్థులు ఎప్పుడూ ఒక cohesive సమూహంగా వ్యవహరించ లేదు.ఒకే మతానికి చెందినవారిగా కొన్ని shared symbols ఉన్నప్పటికీ,ఆచారవ్యవహారాలు, విధివిధానాలు,సాంప్రదాయాలూ అన్నీ కులపరంగా ఏర్పరచబడ్డాయి లేదా అలాగే ప్రచారం కల్పించబడ్డాయి.

చాతుర్వర్ణాల సృష్టినుంచీ పంచమకులాల్ని చేర్చేవరకూ విభజించి పబ్బంగడుపుకునే బ్రాహ్మణక్షత్రియవర్ణాల ఆధిపత్య కుట్ర తప్ప మతపరిరక్షణ ఎవరి ఉద్దేశమూ కాలేదు. జ్ఞానాధారిత,రాజ్యాధికారాధారిత సంఘం నుంచీ భూమిఆధారిత సంఘం ఏర్పడే సరికీ నియో-క్షత్రియ (రెడ్డి,కమ్మ,బలిజ మొ”)కులాలు తమ అధికారాన్ని చెలాయించాయేతప్ప సర్వమానవ సమానత్వం ఎక్కడా చూపించలేదు. అందుకే ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.

భూమినుంచీ రాజకీయం రాజ్యాధికారానికి మూలమవ్వగానే ఇవే కుల సమీకరణాలు ఆ వ్యవస్థమీద superimpose అయ్యాయి.అంటే వ్యవస్థ మారినా మూలాలు మాత్రం అవే అన్నమాట.ఓట్ బ్యాంక్ రాజకీయ క్షేత్ర్రంలో ఈ వర్గసమూహాల స్పృహ విజయవంతంగా ప్రతిసారీ reinforce చెయ్యబడింది.ప్రజాస్వామ్యంలో సమానత్వం తేవడంపోయి రాజకీయలభ్ధి కోసం కులాలు మరింత కరుడుగట్టిపోయాయి.కొన్ని కులాలు తమపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ కులాల ఉనికిని బలోపేతం చేస్తుంటే,మరికొన్ని తమకు సంక్రమించిన అధికారం ఎక్కడ కోల్పోతామో అన్న భయంతో మరింతగా ఈ కులవ్యవస్థని వ్యవస్థీకరిస్థున్నాయి.

ఇటువంటి రాజకీయబ్రహ్మాస్త్రాన్ని త్యజించి సమానత్వాన్ని కాంక్షించే ఆలోచన దాదాపు అన్నికులాల్లోనూ అడుగంటింది. ఇది హిందూమత సమస్య కాదు. ఇదొక ఆర్థిక-సామాజిక-రాజకీయ సమస్య.కులాలకి మూలాలు మతంలో వున్నా,అసలే అరవ్యవస్థీకృత హిందూమతంలో ఈ విస్తృత సమస్యను తీర్చే శక్తి లేదు.ఈ సామాజిక సమస్యకు మతపరమైన సమాధానం వెతికితే అది మరింత ప్రమాదకరమైన పరిణామం అవుతుందేతప్ప solution ఏనాటికీ కాదు.

కాబట్టి, కులాన్ని ఒక సామాజిక వర్గంగా చూసి ఆర్థం చేసుకుని ఆరాతీసి సమాధానాలు వెతకగలిగితే కొంతైనా సాంత్వన కలగొచ్చు. హిందూమత పరిరక్షణలో భాగంగా కులాలను విడనాడాలని పిలుపునిస్తే మాత్రం మతాన్ని వదిలేస్తారేమోగానీ కులాల్ని చాలా మంది వీడలేరు.ఆధ్యాత్మికతకు మతమైతే కులం ఆర్థిక-సామాజిక-రాజకీయ అధికారానికి హేతువు.ఈ ఒక్క కారణం చాలు మతాన్ని త్యజించి కులాన్ని తలకెక్కించుకోవడానికి.

(Visited 168 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply