హృదయాలను శుభం చేసినవాడు..నవ తెలంగాణా లో చక్కటి వ్యాసం

హృదయాలను శుభం చేసినవాడు..నవ తెలంగాణా లో చక్కటి వ్యాసం

చరిత్రలో తనకంటూ స్థానంలేని మహాత్ములు, మహనీయులు ఎందరో.. వారి నిజమైన చరిత్ర వారి బిడ్డలుగా మనం తప్ప మరెవ్వరు రాయగలరు? నిజంగా మనమే రాయాలి. చరిత్ర తెలియని వారు చరిత్రను నిర్మించలేరు. మరుగున పడ్డ మహనీయుడు, ఆధునిక భారతం గర్వించదగ్గ మహాశక్తి చాకలి వాగ్గేయకారుడు సంత్‌ గాడ్గేబాబా గురించి ఈ వారం చార్వాక పాఠకుల కోసం..

మహరాష్ట్రలో 1876 ఫిబ్రవరి 23న సఖూబాయి, జింగారాజీ దంపతుల రెండవ సంతానం డేబూజీ, తర్వాత కాలంలో గాడ్గే బాబాగా ప్రసిద్ధికెక్కారు. రజక కులం సేవ కులం. భారతదేశంలో కొన్ని చోట్ల వెనుకబడిన కులంగా కొన్ని చోట్ల అంటరాని కులంగా పిలుస్తున్నారు. ఊరి వాళ్లందరి గుడ్డలు పోగు చేయడం నదికి తీసుకెళ్లి ఉతకడం, ఇంటికెళ్లి ఇచ్చిరావడం, వారు పెట్టింది తెచ్చుకోవడం, సవర్ణుల పెండ్లిండ్లకు దారి పొడవునా పల్లకి వెంట పరిగెత్తడం, చదువుకు దూరంగా ఉండటం గాడ్గే చూసాడు. తండ్రి చిన్న తనం నుండి మద్యం మత్తుకు అలవాటు పడి, అప్పుల పాలై చివరకు అనారోగ్యంతో చనిపోయాడు. గాడ్గే తన మేనమామ వద్ద పెరిగాడు. కష్టపడే మనస్థత్వం. ఆటలు, పాటలు పాడుతూ అందరితో కలివిడిగా ఉండేవాడు. పశువులను కాస్తూనే, పశువుల కాపర్లతో భజన మండలి తయారు చేసాడు. వినోద భరితమైన పాటలు పాడేవాడు. ఆ పాటలకు ఆ ఊరు ఊరంత వంత పాడేది. అడుగులకు అడుగు కదిపేది. భజన పాటలతో కులం మనల్ని ఎట్లా విడదీసింది. మతం మనల్ని ఎందుకు కలువనీయడం లేదు? అంధులు వికలాంగులు, కుష్టు రోగులు, బిక్షగాళ్లు మరెంతో మంది ఉన్నారు. వాళ్లందర్ని పిలిచి మన భజన మండలి తరుపున ఒక్క పూట కడుపునిండా భోజనం పెడుదాం. అన్న దానం కంటే మరో పుణ్యకార్యం ఉందా? అంటూ పేదలకు భోజనాలు పెట్టడం, సహపంక్తి భోజనాలను చూసి అక్కడి సవర్ణులు అగ్రహించడం, అవమానించడం నిత్యకృత్యంగా ఉండేవి. ఇదే ఆయన ప్రజా జీవితం ఆరంభం. భజన మండలియే మెల్లమెల్లగా ఒక గొప్ప సంఘ సంస్కరణోద్యమంగా బాటలు వేసింది. 
వ్యవసాయం పనుల పట్ల అమిత ప్రేమ, నాగలి దున్నడం పంటలు పండించడం, వ్యవసాయంలో కూడ ఓ శాస్త్రముందని దాని గురించి నేర్చుకోవాల్సి ఉందని గ్రహించాడు. కొత్త పంటలు వేసేవాడు, ఊరి వారందరికి ఆదర్శంగా పని మంతుడు, మాట మీద నిలబడతాడు, ఏం చెప్తాడో అదే చేస్తాడు అనేంత పేరుంది. గాడ్గేకు 16ఏండ్లు. గాడ్గేకు పెండ్లి చేయాలనే ఆలోచన తల్లి సఖూబాయికి వచ్చింది. పొడుగ్గా, బలంగా, ఆరోగ్యంగా ఉన్నా, ఇల్లు లేదు, పొలం లేదు, వీడికంటూ ఏమీ లేదు. ఉన్నదంతా మేనమామదే. అనుకునే లోపు పేద చాకలి కూతురు కుంతాబాయితో గాడ్గే పెండ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ పెండ్లి అందరికి సంతోషాన్నిచ్చింది. సమాజమే పాఠశాల భూమే దైవంగా బావించాడు. ఏ గురువు దగ్గర విద్యనభ్యసించలేదు. అక్షరాలు రాయడం చదవడం రాదు. గొప్ప జ్ఞాని కాదు, అనుభవజ్ఞుడు కాడు. సామాజిక పరిస్థితులే నేర్పించాయి. ఏది న్యాయం? ఏది అన్యాయం అని తన తర్క బుద్ధితో గ్రహించగలిగాడు. గాడ్గే ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు. ”రైతు ఎప్పుడు గొప్ప వాడు కాలేడు, చిన్న వాడు కాలేడు, రైతు ఎప్పుడు రైతుగానే ఉంటాడు. మట్టి పొలాల్లో శ్రమించడం, బంగారం పండించడం మాత్రమే అతని పని. అదే అతని మతం అదే అతని దైవం, అందుకే రైతంటే నాకు అత్యంత గౌరవం” అనేవాడు. మహరాష్ట్రలో మార్వాడీలు, షావుకార్లు దోపిడీ ఎక్కువ రైతులకు అప్పులివ్వడం, తప్పుడు లెక్కలు, రశీదులు ఇవ్వకపోవడం, గింజలను లాక్కేళ్లడం, భూముల్ని గుంజుకోవడం ఈ విధమైన షావుకార్ల అన్యాయాల పట్ల ఆక్రమాల పట్ల ఎదురు తిరగడం, ఇక నుండి ఒక్క ధాన్యపు గింజను కూడా ఇవ్వను, భూమిని గుంజుకున్న ఊరుకోము అంటూ షావుకార్ల అగడాలకు అడ్డుగా నిలబడ్డాడు. సమిష్టిగా షావుకారిని తరిమికోట్టిన సాహసిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రామంలో సహపంక్తి భోజనాలతో సోదరభావంతో సామాజిక మార్పుకు నాంది పలికాడు. 
కుంతాబాయి ఓ బిడ్డకు జన్మనించింది. రజకుల ఆచారం ప్రకారం బిడ్డ పుట్టిన పన్నేండవ రోజు మాంసాహరం, మద్యం, కులస్థులందరికి పెట్టాలి. ఇది తరతరాల సంప్రదాయం అంటూ పట్టుబట్టారు. మాంసాన్ని తినిపించడం, మద్యాన్ని తాగించడం అనేది కులం కాదు. సంప్రదాయం కాదు, అలాంటి ఆచారాలను నేను పాటించను. మద్యాన్ని, మాంసాన్ని తీసుకోవడం వల్లనే, దాన్ని ఆచారంగా బావించడం వల్లే రజక కులస్థులం నాశనమైపోయాం. బిక్షగాళ్లమయ్యాం. అప్పుల్లో మునిగిపోయి షావుకారుల వలలో చిక్కుకుపోయాం. అంటూ బిడ్డ పుట్టిన పన్నేండొవ రోజు నిరాడంబరంగా జరిపాడు. మాంసం మద్యం బదులుగా బూందీలడ్డూలు పెట్టాడు. మాంసం, మద్యం లేని భోజనాన్ని కులస్థులు కోపగించుకున్న వాళ్లనేమి పట్టించుకోలేదు. గాడ్గే మొదటి సంతానం అలోకబాయికి పన్నేండవరోజు కార్యక్రమం మరో సామాజిక మార్పుకు అడుగు అని చెప్పవచ్చు.
కులం – ధర్మం మనిషి మొక్క మానసిక స్థితిని ఎలా నియంత్రణ చేస్తాయో గమనించాడు. కులం సంప్రదాయ బద్దమైనది. సంకుచితమైనది. అది ఎలాంటి మార్పును స్వీకరించదు. అది ధర్మాన్ని ఆధర్మంగా, ఆధర్మాన్ని ధర్మంగా భావిస్తుంది. ఈ విషయాన్ని గాడ్గే బాబా అర్థం చేసుకున్నాడు. అందుకనే సామాజిక పరివర్తన రావాలని ఆశించాడు. సామాజిక మార్పు, సామాజిక విప్లవం అనేవి ఏ చదువుకున్న వ్యక్తి అస్తికాదు. ప్రజాసేవ, ప్రజాక్షేమం, సత్యాన్వేషణ అనే ఆలోచనలు కలిగి వున్నందు వల్ల అక్షర జ్ఞానం లేనిగాడ్గే బాబా విద్యావంతుడైన వ్యక్తికంటే గొప్ప విప్లవకారుడయ్యాడు. ఉన్నతమైన మానవతా విలువలను చూసి విద్యావంతులు సిగ్గుపడేది. సామాజిక మార్పే ఆయనకు ప్రేరణ. ”ఇంతవరకు జరిగిన తప్పులన్నింటిని సరిదిద్దాలి అదే తెలివైన పని” అని గాడ్గే అంటుండేవాడు. ఆయన ఎక్కువ సమయం సమాజంలో పేరుకున్న మురికిని పారద్రోలడానికి వెచ్చించేవాడు. ఉదయమే లేచి చీపురు తీసుకుని ఇల్లు, బయట, నది ఓడ్డున ఉడ్చేవాడు. పలుగు పార తీసుకొని చెత్త ఎక్కడ ఉంటే అక్కడికెళ్లి ఎత్తిపోసే వాడు. ప్రచారం కోసమో, ప్రదర్శనకోసమో కాదు. ఎవరికి కష్టం వచ్చినా స్వయంగా సహయం చేసేవాడు. కట్టేలు పగులగొడుతూ కనిపిస్తే స్వయంగా తానే కట్టేలు పగులగొట్టేవాడు. పసి పిల్లలను ఎత్తుకుని బరువులు మోస్తున్న తల్లులు ఎవరైనా కనిపిస్తే ఆ బరువును స్వయంగా తన తలపై పెట్టుకుని వాళ్ల ఇంటికి చేర్చేవాడు. రైతు బండి బురదలో యిరుక్కుపోతే బండిని తానే బయటకు తీసేవాడు. ఈ విధంగా ప్రజా సేవ చేసాడు.
పూజకు ఉపయోగించే ఆపూలకంటే నా చీపురే చాల గొప్పది. ఈ చిపురు సమాజ, మనిషి మాలిన్యాన్ని వూడ్చేస్తుంది. అంటూ కిన్నేర మిటూతూ వేలాది మంది జాతరలో గీతాన్ని ఆలాపించారు. మొదట్లో పిచ్చోడు అనుకున్న వాళ్లు ఆలోచించడం చేసారు. క్రమంగా వారిలో గాడ్గేబాబా పట్ల గౌరవబావాలు ఏర్పడ్డాయి. కింది కులాల్లో వెలుగులు పంచుతున్న ఓ ఆశాకిరణమయ్యాడు. ఆయన పనుల్లో పాలు పంచుకోవడం మొదలు పెట్టారు. రకరకాల బిరుదులు యివ్వసాగారు. గాడ్గేబాబా మాత్రం ప్రజల మేడలో వేలాడే గొలసులో ముత్యం కంటే, తొలిగుక్కకై దాహర్తుల గొంతులో ఒకనిగా ఆయ్యేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పుకున్నాడు. రైలులో పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యం చేసాడు. పాటలు, మాటలు విన్న ప్రజానీకం తలవంచి అభివాదం చేసారు. వెనుకబడిన కులాల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, మూఢాచారాలు, జంతుబలులు, మద్యపానం, కన్యాశుల్కం, వరకట్నం లాంటి అనేక నమ్మకాలపై యుద్ధం ప్రకటించాడు. నిర్మాణాత్మక పనులు చేపట్టాడు. దీని కొరకు పాట ఆయుధంగా వేలాది మంది బావ ప్రచారకులుగా, సాంస్కృతిక సైన్యాన్ని తయారు చేసారు. గాడ్గేబాబా కుమార్తె పెండ్లికి కూడా హాజరుకాలేదు. అమ్మ వృద్ధాప్యంలోకి అడుగిడింది. తన భార్య ఆనారోగ్యంతో ఉందని తెలుసుకుని ఒక పల్లెలో కర్రలతో, గడ్డితో ఒక గుడిసేను నిర్మించాడు. తన తల్లిని, భార్యను తరలించాడు. అవసరానికి మించి వస్తువులు, పదార్థాలు వుంచుకోకూడదనే సిద్ధాంతం వారిది. విద్య లేకపోతే మనిషి రాయితో సమానం తనకు విద్యా లేకపోవడంతో జరిగిన నష్టాలు, అవమానాలు బోధించాడు. పూజారి, బాబాల పేరుతో మాయమాటలు చెప్పేవాళ్లను నమ్మరాదు. వారి పాదాలను కడిగి సాష్టాంగపడి మొక్కి ఆ నీళ్లను శూద్రులు నెత్తిమీద జల్లుకునే సంప్రదాయం పాటించరాదు. మూర్ఖులైన బ్రాహ్మణ సాదువులు శూద్రుల్ని పేదలుగా, పనోళ్లుగా, పైకులాల సేవకులుగా, బానిసలుగా ఆజ్ఞానమనే చీకటిలో ఉంచారు. ఇకపై ఇది కొనసాగకూడదు అంటూ మూఢచారాల కుళ్లును కడిగాడు. హేతువాదంతోనే ఆజ్ఞానం దూరమని చెప్పాడు. నాకు ఎవరూ శిష్యులు లేరు. నేను ఎవరికి గురువును కాను, పనిలోనే ప్రగతి ఉంది. మనమంతా కార్మికులమే అంటూ సామాజిక, సేవ కార్యకలాపాలు దూరాలకు విస్తరించాయి. పెద్ద నాయకులు గాడ్గే బాబా కార్యకలాపాల గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. పెద్దవాళ్లు ఆయన్ని కలవాలని ఉత్సహంం చూపిన వారికి కనీసం సమయమూ కూడ ఇవ్వలేదు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి బాలాసాహెబ్‌ఖేర్‌ గాడ్గేబాబా గురించి గాంధీకి చెప్పారు. అప్పుడు గాంధీజీ బాబానుకలవాలనుకున్నాడు. గాడ్గే ఆశ్రమానికి గాంధీ వచ్చారు. రోట్టే, ఉల్లిపాయ, మిరపకాయ భోజనం చేసారు. గాంధీ కోరిక మేరకు గాడ్గేబాబా అక్కడే చక్కటి కీర్తనలు గానం చేసాడు. ఆగానమృతం గాంధీ మరణించేవరకు మరచిపోలేదు. డా.అంబేడ్కర్‌ గాడ్గే బాబా సేవ కార్యక్రమాలను ఎంతగానో మెచ్చుకునేవాడు. గాడ్గే, అంబేడ్కర్‌ కలిసి కార్యక్రమాల గూర్చి చర్చించుకునేవారు. పండరీపురంలో అంటరాని వారి కోసం కట్టించిన ధర్మశాలను గాడ్గే బాబా అంబేడ్కర్‌కు అప్పజేప్పాడు. 1949 జులై 14న ఆనారోగ్యంతో బాబా ఉన్నాడని తెలిసిన అంబేడ్కర్‌ కేంద్రన్యాయశాఖ మంత్రి ఢిల్లికి వెళ్లేది వదిలి బాబా దర్శనం చేసుకుని రెండు కంబళ్లు అతనికి కప్పివేళ్లారు. హిందూ మతాన్ని వదిలేయడాన్ని గాడ్గే బాబా ఆశీస్సులు తీసుకుని అంబేడ్కర్‌ బౌద్ధమతం స్వీకరించారు. మహమహులకు సలహాలు ఇచ్చే జ్ఞానవంతుడు. మహరాష్ట్రలోని సామాన్య మానవుల గుండెచప్పుడుగా మారి, సామాజిక, సాంస్కృతిక విలువల కోసం మేదోపరమైన మార్పుకోసం పని చేసిన మహనీయుల్లో గాడ్గే ప్రత్యేకమైన పాత్ర పోషించాడు. చదువుకున్న జ్ఞానులు చేయలేని ఎన్నో పనులు చాకలి బాబా చేసి చూపించాడు. ప్రతిక్షణం సామాన్యుడి ఆలోచన, చైతన్యం తన గాన మాధుర్య కీర్తనలతో నిదురపోతున్న సమాజాన్ని మేల్కోల్పాడు. జీవిత చరమాంకం వరకు నిరంతంగా సామాన్యుడి ఆలోచనను చైతన్యపరుస్తూ జీవితంలో చివరి కీర్తన డిసెంబర్‌ 8, 1956బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ మరణంతో కుంగిపోయిన బాబా తన చివరి కీర్తనను అంబేడ్కర్‌కు అంకితమిచ్చాడు. ఆ గానాన్ని అలపిస్తూ కన్నీటి ప్రవాహన్ని అపుకోలేక ఏడుస్తూ దళిత జనబందువుడు తనువు చాలించాడని జీర్ణించుకోలేకపోయాడు. 80ఏండ్ల బాబా ఎనాడు ఆరోగ్యాన్ని లెక్కచేయలేదు. నోట మాట, తన పాటని వదిలిపెట్టలేదు. మాట్టాడుతూనే పాడుతూనే, డిసెంబర్‌29, 1956న నాగర్‌లాడి దారిలో తుదిశ్వాస విడిచారు. బాబా మరణ వార్త మహరాష్ట్ర అంత వ్యాపించింది. లక్షలాది మంది పాల్గోన్న అంతిమ యాత్రగా నిలిచింది. సమాజం ఈసడించుకునే రజక కులంలో పుట్టిన గాడ్గేబాబా అగ్రకులస్థులు చేతులేత్తి నమస్కరించే సంస్కారం పొందగలిగినవాడు. వేల మంది అది శంకరాచార్యులను అద;పాతాళానికి తోక్కాడు. పాట ద్వారా బ్రాహ్మణీయ అకృత్యాల గుట్టు విప్పాడు. కానీ, మనం నేటికి ఆ శంకరాచార్యుడు పన్నిన వలలో నుండి బయటికి రాలేకపోతున్నాము. శంకరాచార్యుల వారసులు నేటి పాలకులు యజ్ఞాలు, యాగాల ద్వారా వక్రమార్గాన్ని అనుసరిస్తున్నారు. ప్రజావాగ్గేయకారుడు సౌశీల్యుడు, సచ్ఛీలుడూ అయినా గాడ్గే బాబా పథాన్ని అనుకరించాలా? ఈ రోజే మనం నిర్ణయించుకోవాలి. నేడే బహుజన సమాజమంతా ఆయన సేవల ముందు శిరస్సు వంచి నమస్కరిస్తుంది. ఆయన మార్గాన నడువమని ప్రతిజ్ఞ చేస్తుంది. 
– భూపతి వెంకటేశ్వర్లు, ఎడిటర్‌, 
మోదుగుపూలు, 

(Visited 232 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply