భౌద్దమతం స్వీకరించనున్న గుజరాత్ దళితులు

భౌద్దమతం స్వీకరించనున్న గుజరాత్ దళితులు

నలుగురు దళితులను కారుకు కట్టేసి చితక్కొట్టిన 


సంఘటనతో సంఘటితమైన గుజరాత్ దళితులు బౌద్ధమతాన్ని స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. అలా 60వేల మంది బౌద్ధమతాన్ని పుచ్చుకునేందుకు సిద్ధంకాగా ఇప్పటికే 50 వేల మంది తమ దరఖాస్తులను గుజరాత్ దళిత్ సంఘటన్‌కు సమర్పించారు. వాటన్నింటినీ జిల్లా అధికార యంత్రాంగాలకు అందజేశామని సంఘటన్ సహ వ్యవస్థాపకులు అశోక్ సామ్రాట్ మీడియాకు తెలిపారు. అధికారులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా తమ మతమార్పిడి కార్యక్రమం కొనసాగుతుందన్నారు.


మత మార్పిడులపై ఆంక్షలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. మతం మారాలనుకున్న వాళ్లు ముందస్తుగా జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోవాలంటూ 2009లో గుజరాత్ ప్రభుత్వం మతస్వేచ్ఛా చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. అయినా 2013లో సౌరాష్ట్ర దళిత సంఘటన ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది దళితులు హిందూమతాన్ని వదిలిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించారు. అప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్న దళితుల్లో సగం మందికి కూడా అధికార యంత్రాంగం అనుమతి మంజూరు చేయలేదు. ఓ దశలో దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా అధికారులు నిరాకరించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు కూడా సౌరాష్ట్ర నుంచే ఎక్కువ మంది దళితులు మతం మారేందుకు ముందుకువచ్చారు. గో సంరక్షకుల నుంచి ఎదురవుతున్న దాడులు, అగ్రవర్ణాల ఆగడాలను భరించడం కన్నా తమకు మతం మారడమే మంచిదని వారు చెబుతున్నారు. బౌద్ధం కాకున్నా ముస్లిం మతంలోకి మారేందుకు కూడా తమకు అభ్యంతరం లేదని, కనీసం ఇళ్లలోకి రాణిస్తారని, వారితోపాటు కలసి భోజనం చేసేందుకు అనుమతిస్తారని వారు చెబుతున్నారు. గుజరాత్‌లో అగ్రవర్ణాల వారు ఈ రోజుల్లో కూడా తమను అంటరానివారు గానే చూస్తున్నారని, తమతో పనిచేయించుకొని తమకు అన్నం పెట్టాలన్నా, మంచినీళ్లు ఇవ్వాలన్నా ప్రత్యేక పాత్రల్లో బిచ్చగాళ్లకు పెట్టినట్లు పెట్టిపోతారని వారిలో కొందరు ఆరోపించారు.

తమ మత మార్పిడి కార్యక్రమం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రాజ్‌కోట్, అహ్మదాబాద్, వడోదర, పలాన్‌పూర్‌లో జరిగే బహిరంగ సభల్లో కొనసాగుతుందని దళిత సంఘటన్ నాయకులు తెలిపారు. అయితే తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. దేశంలో తొలిసారిగా అంబేద్కర్ నాయకత్వంలో దేశంలోని ఆరు లక్షల మంది దళితులు 1956లో బౌద్ధ మతంలోకి మారారు. అయితే నాటి కార్యక్రమం సింబాలిక్‌గానే మిగిలిపోయింది. వారిలో ఎక్కువ మంది హిందూ మతాచారాలనే పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం అలాంటి అవసరం రాదని, బౌద్ధమత సంప్రదాయం ప్రకారమే నడుచుకుంటామని సౌరాష్ట్రకు చెందిన దళితులు చెబుతున్నారు.

(Visited 371 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply