బొజ్జా అప్పలస్వామి జయంతి, వర్ధంతి 

బొజ్జా అప్పలస్వామి జయంతి, వర్ధంతి 

అప్పలస్వామి ఇతర వర్ణాల వారితో వ్యవహరించేటప్పుడు సమాన స్థాయిలో మాట్లాడేవారు. అక్కడి రాజులతో ‘‘ఏమయ్యా రామభద్రరాజా…’’ అంటూ మాట్లాడగలిగే ధైర్యం 1950 ప్రాంతాలలోనే ఆయన చూపారు. చదువుకున్న మాల మాదిగలకు వారి వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇప్పించేవారు. మాల మాదిగలకు ప్రవేశం లేని ఎన్నో రంగాలలో అప్పలస్వామి వారికి ప్రవేశం కలిగించారు. ఆయనను సమకాలికులు ‘ఆదియాంధ్ర రత్న’గా గౌరవించుకున్నారు. 
అప్పలస్వామి డా. అంబేడ్కర్‌ అనుయాయి. అంబేడ్కర్‌ స్థాపించిన షెడ్యూల్డ్‌ కేస్ట్స్‌ ఫెడరేషన్‌ పార్టీ తరఫున అమలాపురం రిజర్వుడు నియోజక వర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలోనూ (1952-53), ఆంధ్రా అసెంబ్లీలోనూ (1954-55), ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోనూ (1956-62) సభ్యులుగా విశేష సేవలు అందించారు. 

అప్పలస్వామిగారు చిన్నప్పటి నుంచీ స్వతంత్ర వ్యక్తిత్వంతో ధైర్య సాహసాలతో కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. బ్రహ్మసమాజ ధర్మ ప్రభావమూ, కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావమూ బలంగా ఉన్న రోజులలో ఆ రెండింటినీ బాగా అర్థం చేసుకుని, తనదైన ఆలోచనా శక్తితో వీరు అంబేడ్కర్‌ భావజాలాన్ని అనుసరించి జీవితాన్ని మలుచుకున్నారు. ఆత్మగౌరవం, నిమ్న వర్గాల ఆర్థిక సామాజిక అభివృద్ధి లక్ష్యంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.

                  పిఠాపురం మహారాజావారి పాఠశాలలో చదువుకోవటం, రఘుపతి వెంకటరత్నంనాయుడుగారి ప్రసంగాలు వినటం, దేవులపల్లి కృష్ణశాసి్త్ర గారితోనూ, ప్రముఖ సంఘ సంస్కర్తలతోనూ సహవాసం- వీరి సహజ మూర్తిమత్వానికి మెరుగులు దిద్దాయి. అంటరానితనాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆచరించి చూపారు. పబ్లిక్‌ స్థలాలలో అంటరానితనం పాటించరాదని ప్రభుత్వం ప్రకటించినా వాస్తవాలు వేరుగా ఉంటాయని ఈనాడు అందరికీ తెలుసు. వ్యక్తులు తమకుతామే దాస్య శృంఖలాలను తెంచుకోవాలని అప్పలస్వామి చెప్పేవారు. ః

 

                  ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక నాటక ప్రదర్శనకు కుర్చీ టికెట్టు కొనుక్కుని వెళ్లారు. అప్పట్లో మాల మాదిగలకు నేల టిక్కెట్టే. అందులోనూ వారికి ప్రత్యేక స్థలం కేటాయించేవారు. అప్పలస్వామి నేరుగా కుర్చీ టికెట్టుతో వెళ్లి కుర్చీలో కూర్చునేసరికి అంతా గగ్గోలు పడ్డారు. మేనేజరూ ఇతరులూ వచ్చి బెదిరించారు, భయపెట్టారు; ఆట ఆగితే నష్టం అంటూ బతిమాలారు. అయినా అప్పలస్వామి బెదరలేదు. పోలీసు ఇనస్పెక్టరు వచ్చాడు. మాల మాదిగలకు ప్రత్యేక స్థలం ఉందన్న విషయం గురించి టికెట్‌ మీదనే రాశారని చూపించాడు. ‘‘అలా రాయటం తప్పు’’ అన్నారు అప్పలస్వామి. అప్పటి పోలీసువ్యవస్థ కొంత బాగానే ఉన్నది గనుక- ఆ వచ్చిన ఇనస్పెక్టరు సహృదయుడు గనుక- హాలు వాళ్ళకూ, అగ్ర కులాలకూ సర్ది చెప్పి, తాను అక్కడే అప్పలస్వామి పక్కన మరో కుర్చీ వేయించుకొని ప్రదర్శన చూసి వెళ్ళాడు. అక్కడ అప్పలస్వామి ప్రదర్శించిన ధైర్యాన్ని చూసి నేల టిక్కెట్‌ వాళ్ళంతా కర్రలతో వచ్చి అతనికి రక్షణగా నిలబడ్డారు. ‘‘మన వాడేరా’’ అంటూ గర్వపడ్డారు. తమకూ అందరితో పాటూ కూర్చునే హక్కు ఉందని గ్రహించారు.

                  జిల్లాలో మాల మాదిగలు విద్యావంతులుగా ఎదగడానికీ లంక భూములు సాగు చేసుకుంటూ ఆర్థికంగా బలపడటానికీ అప్పలస్వామి కృషిచేశారు. జిల్లాలో అనేక చోట్ల ఆదియాంధ్ర సంఘాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆదియాంధ్ర కులాలంటే నిమ్నజాతులు అందరూ అనే భావంతో ఉండేవారు. 1942లో షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ ఏర్పడ్డాక ఈ ఆదియాంధ్ర సంఘాలన్నీ అందులో విలీనమయ్యాయి. ఈ నాయకులను పైకి రాకుండా చేయటానికి సమాజంలో ఎన్నో కుట్రలు జరిగాయి. కమ్యూనిస్టులపై పోలీసు నిఘా ఉన్న రోజుల్లో ఈయనను కమ్యూనిస్టుగా ప్రచారం


 చేసి పోలీసుల చేత చంపించాలని చూశారు. అయితే ఈయన చేతి వేలి ఉంగరం మీద అంబేడ్కర్‌ బొమ్మను గమనించిన ఒక పోలీస్‌ అధికారి నిజం తెలుసుకుని ఈయనను వదిలిపెట్టాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో వీరు అంబేడ్కర్‌ పార్టీ తరఫున నిలబడి గెలిచారు. ఆ ఎన్నికలలో కేవలం అంబేడ్కర్‌ నామ మహిమతోనే తాను గెలిచానని ఆయన చెప్పుకున్నారు. నిమ్న కులాలలో ఐక్యత ఉండేది. ఫెడరేషన్‌ సభ అనగానే ఎవరికి వారు తాటాకులు గెడలు తెచ్చి పందిళ్లు వేసేవారు. కూలి డబ్బులతో అద్దె సైకిళ్ల మీద తిరిగి ప్రచారం చేసేవారు. ఇప్పటిలాగా డబ్బు ఖర్చుపెట్టి ఓటు కొనే పరిస్థితి లేదు.

 

                  అప్పలస్వామి గారు ఇతర వర్ణాల వారితో వ్యవహరించేటప్పుడు సమాన స్థాయిలో మాట్లాడేవారు. అక్కడి రాజులతో ‘‘ఏమయ్యా రామభద్రరాజా…’’ అంటూ మాట్లాడగలిగే ధైర్యం 1950 ప్రాంతాలలోనే ఆయన చూపారు. చదువుకున్న మాల మాదిగలకు వారి వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇప్పించేవారు. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నిమ్నకులాల వారికి అర్హతలలో సడలింపు ఇచ్చి మరీ ఉద్యోగాలిచ్చేవారనీ, లోటు బడ్జెట్‌ అయినా సరే నిమ్నకులాలకు తగినంత కేటాయింపు జరగవలసిందే అని పట్టుబట్టేవారనీ అప్పలస్వామిగారు చెప్పేవారు. నీలం సంజీవరెడ్డి హయాంలోనూ అప్పలస్వామిగారు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఏదైనా రికమండేషనో దరఖాస్తు కాగితమో పట్టుకుని వెళ్లినప్పుడు సంజీవరెడ్డిగారు దానిని చదువుతూ ఉంటే, ‘‘ఏం చదువుతావు, నేను చూశానులే, సంతకం పెట్టు’’ అనేవారట. ‘‘అయితే సరే’’ అంటూ ముఖ్యమంత్రి సంతకంచేసి ఇచ్చేవారట. అప్పలస్వామి గారి జీవితంలోని (1912-2005) ఇలాంటి సంఘటనలెన్నో స్ఫూర్తినిస్తాయి. ఆయనను సమకాలికులు ‘‘ఆదియాంధ్ర రత్న’’గా గౌరవించుకున్నారు.

                  మాల మాదిగలకు ప్రవేశం లేని ఎన్నో రంగాలలో అప్పలస్వామిగారు వారికి ప్రవేశం కలిగించారు. తిరుమల-తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలలో దళితులకు అవకాశాలు కలగజేసినది ఆయనే. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ ప్రజాహితం కోసమూ, జాతి అభివృద్ధి కోసమూను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరు ఏ విషయంలోనూ అంబేద్కర్‌ను వ్యక్తిగతంగా సంప్రదించలేదట. ఆయన మార్గంలో, ఆయన చూపిన దారిలో పయనిస్తూవెళ్లారు. ‘‘పార్టీ నాయకత్వపు ఆంక్షలు అప్పట్లో ఫెడరేషన్‌లో లేవు. అంబేడ్కర్‌ తన పార్టీ వారిని సమర్థంగా ఎదగనిచ్చారు’’ అని అప్పలస్వామిగారు చెప్పారు.

                  మరోవిషయం ఏమిటంటే, మహారాష్ట్రలో అంబేడ్కర్‌ ఫెడరేషన్‌ పార్టీ ఓడిపోయినప్పుడు ఇక్కడ ఆంధ్రలో ఫెడరేషన్‌ గెలిచింది. అదంతా అంబేడ్కర్‌ భావజాల ప్రభావం. ‘‘గుడికి దూరంగా ఉన్నవారు దేవునికి దగ్గరౌతారు’’ అన్నారు అప్పలస్వామి. ‘‘అంబేడ్కర్‌ మహారాష్ట్రలో పుట్టాడు. గోదావరి నీళ్లు తాగాడు. ఆ గోదావరీ ప్రవాహం ఆంధ్రదేశానికి ఆయన స్ఫూర్తిని తీసుకువచ్చింది. ఆ నీళ్లే నేనూ తాగాను. గోదావరి మీద పడిన ఆయన చూపులే కోనసీమ వారికి మార్గ నిర్దేశం చేశాయి’’ అని చెప్పిన అప్పలస్వామిగారి స్వగ్రామం కోనసీమలోని కందికుప్ప. ఆయన జన్మించినదీ నిర్యాణం చెందినదీ ఆగస్టు 19వ తేదీనే. 

  బి. విజయభారతి 

(నేడు బొజ్జా అప్పలస్వామి జయంతి, వర్ధంతి)

(Visited 169 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply