బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఏం చెప్పేవారు?

బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఏం చెప్పేవారు?

బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఏం చెప్పేవారు? పాతికేళ్ల నుంచి భారత కోరి వరించి అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాలు, వాటి ప్రస్తుత పర్యవసానాల నేపథ్యంలో ఈ ప్రశ్న అత్యంత కీలకమైనది. అంబేద్కర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. అరుదైన మేధావి. అమానవీయ భారతీయ కుల సమాజాన్ని పునాదుల నుంచి కదిలించి ‘మనిషి’గా నిలబెట్టేందుకు ప్రయత్నించిన సాహసి. భారతరాజ్యాంగ నిర్మాతగా, విద్యావేత్తగా, జర్నలిస్టుగా, సంఘ సంస్కర్తగా, నిమ్న వర్గాల ప్రజల హక్కుల కోసం జీవిత పర్యంతం పోరాడిన యోధుడిగా, ధిక్కారస్వరంగా….. ఆయన గురించి అందరూ చెబుతుంటారు. అయితే చాలామంది ఆయన మేధోమథనంలోని మరో ముఖ్యపార్శ్వాన్ని మాత్రం ఎందుకో విస్మరిస్తుంటారు.

అంబేద్కర్‌ గొప్ప ఆర్థికవేత్త. నిజానికి ఆయన చదువుకున్నదే అర్థశాస్త్రం. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్‌ చేసిన అంబేద్కర్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి డాక్టర్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పట్టా తీసుకున్నారు. ఆర్థికశాస్త్ర చరిత్రకారులు కూడా అంబేద్కర్‌ను గురించిన ప్రస్తావన తమ గ్రంథాల్లో దాటవేయడం విస్మయం కలిగించే విషయం. నిజానికి బ్రిటిష్‌ ఇండియాలో ఆర్థికవేత్తగా ఆయన చేసిన దోహదం కూడా సామాన్యమైనది కాదు. రూపాయి సంక్షోభంపై ఆయన విశ్లేషణ, ఆలోచనల ఫలితాలే ద్రవ్య, పరపతి నియంత్రణకు ఏర్పాటైన రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అన్న విషయం, బ్రిటిష్‌ ఇండియా వనరుల తరలింపుపై ఆయన వెలువరించిన పరిశోధనా పత్రాలే తర్వాత కాలంలో కేంద్ర, రాషా్ట్రల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకోసం ఏర్పాటైన ఫైనాన్స్‌ కమిషన్‌కు మూలం అన్న విషయం చాలామందికి తెలియదు. అడ్మినిసే్ట్రషన్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ… పేరుతో ఆయన 42పేజీల రీసెర్చ్‌ పేపర్‌ను కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ డిజర్టేషన్‌లో భాగంగా సమర్పించారు. అప్పట్లో అదొక సంచలనం. ఈస్ట్‌ ఇండియా విధానాలు, వాటి పర్యవసానాలు భారతీయుల ప్రయోజనాలను ఎలా దెబ్బతీస్తున్నాయో వివరించారు. సామాజిక పీడన, దోపిడీకి నిలయమైన భారతీయ సమాజంలోని అంతరాల దొంతరలు వాటి వెనకున్న ఆర్థిక మూలాలను అంబేద్కర్‌ అద్భుతంగా విశ్లేషించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన గత 68 ఏళ్లలో పరిస్థితులు చాలా మారాయి. అయినప్పటికీ, సామాజిక రంగాల్లో అంబేద్కర్‌ ప్రాసంగికత మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. మరి ఆర్థిక రంగం విషయంలో ఆయన ప్రాసంగికత మాటేమిటీ?

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోని దేశవాస్తవిక పరిస్థితులను, అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేసిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థను 1990 ప్రాంతంలో విఫలప్రయోగంగా నిర్ణయించి తిలోదకాలు వదిలాం. ఆర్థిక వృద్ధి రేటు దౌడు తీయాలంటే, అభివృద్ధి ఫలితాలు అందరికీ అందాలంటే సంపూర్ణ స్వేచ్ఛా విపణికి దారితీసే మార్గమే ఉత్తమమని ప్రకటించి నూతన ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టాం. ఆచరణలో ఏమైందీ… దేశంలో ఇప్పటికీ 27శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. మరో 50 శాతం మంది ప్రజలు రేఖకు ఎగువన పట్టుజారకుండా నిత్య జీవనపోరాటం చేస్తున్నారు. సమష్ఠిగా సమాజం సృష్టిస్తున్న సంపదను నికరంగా అనుభవిస్తున్నది 23శాతం మంది మాత్రమే. అంత కంటే మించరు. 77 శాతం మందిని ఎక్స్‌క్లూడ్‌ చేసి కొనసాగుతున్న ఆర్థికవృద్ధిలో తరుచుగా విధాన నిర్ణేతలు స్మరించే మంత్రం ఇన్‌క్లూజివ్‌ గ్రోత. అంతకంటే ఫార్స్‌ ఏముంటుంది? అభివృద్ధి నుంచి విడివడిన 77 శాతం మంది, అభివృద్ధిని అనుభవిస్తున్న 23 శాతం మంది… వీరి సామాజిక నేపథ్యాలను అర్థం చేసుకుంటే, సంప్రదాయ భారతీయ సమాజంలోని దోపిడీ ఆధునిక రూపాన్ని ఎలా సంతరించుకుందో అర్థం అవుతుంది. ఇటీవలనే ఇందుకు ఒక సందర్భం కూడా వచ్చింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన బడా సంస్థలు, వ్యక్తుల పేర్లను బట్టబయలు చేయాలన్న అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. పేర్లను బయటపెట్టేందుకు ఆర్‌బిఐ ససేమిరా అంగీకరించడం లేదు. పోనీ పేర్లు బయటపెట్టకున్నా ఎగవేత మొత్తాలనైనా వెల్లడించాలని సుప్రీంకోర్టు అంటోంది. దానికి కూడా ఆర్‌బీఐ అంగీకరించడం లేదు. ఆర్‌బీఐ వైఖరి ఆశ్చర్యంగా ఉంది. ఆర్థిక రంగం అంతా కొన్ని శ్రేణుల చేతుల్లోనే ఉన్నట్టు ఉలికిపాటు ఎందుకు? ఆ శ్రేణులు అలిగితే ఆర్థిక రంగానికి పుట్టగతులుండవన్నంతగా భయాలు ఎందుకు? నిజానికి దేశ సంపద పంపిణీలోని అసమతౌల్యానికి నేటికీ మన సామాజిక నిర్మాణమే ఎలా కారణంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. కొన్ని లక్షలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసిన వారిపేర్లు దాచిపెట్టే బాధ్యత ఆర్‌బీఐకి ఉన్నట్టుగానే తెలుసుకునే హక్కు దేశప్రజలకు ఉంది. పేర్లు బయటపడితే, సంప్రదాయ భారతీయ సమాజంలో కులం చాటున సాగిన శ్రమ దోపిడీకీ, లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేతలకు మధ్య సమాంతరాలను వెతికే వెసులుబాటు లభిస్తుంది. అసంఖ్యాక ప్రజల సమష్ఠి శ్రమఫలితంగా ఉత్పన్నమయ్యే మిగులును ఒకచోటకు సమీకరించేందుకు బ్యాంకులు ఒక సాధనంగా మారాయి. ఈ మిగులును రుణాల పేరుతో కొల్లగొట్టేందుకు సులభమైన మార్గాన్ని అందజేస్తున్నాయి. దీన్ని అందిపుచ్చుకుంటున్న వర్గాలు ఎవరన్నదే ఆసక్తికరమైన అంశం.
నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ తన అర్థశాస్త్ర సిద్ధాంతాలకు అంబేద్కరే స్ఫూర్తి అని 2007లో ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఆర్థికవేత్తగా అంబేద్కర్‌ చేసిన కృషిపై విశ్వవిద్యాలయాలు, అధ్యయనకేంద్రాలు దృష్టి మళ్లించినట్టుగా కనిపించదు. సమకాలీన ఆర్థిక రంగంలోని పరిణామాలను అంబేద్కర్‌ ఆలోచనధార అధారంగా అర్థం చేసుకునే కృషి, అదే వరవడితో పరిష్కారాలను చర్చకు తెచ్చే సన్నాహాలు, ప్రభుత్వాన్ని, విధానాలను నిగ్గదీసే ప్రయత్నాలు.. ఏవీ జరగడం లేదు. పాతికేళ్లుగా మనం అనుసరిస్తున్న విధానాలను అంతకుముందు నాలుగుదశాబ్దాలుపైగా అనుసరించిన విధానాలతో ఏవిధంగా బేరీజు వేయాలో అంబేద్కర్‌ ఆలోచనల నేపథ్యం నుంచి అర్ధం చేసుకునే ప్రయత్నం జరగాలి.
అంబేద్కర్‌ ఆర్థిక దృక్పథం మిశ్రమ ఆర్థిక విధానాలకు దగ్గరగా ఉంటుంది. కీలక రంగాలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ, ఎంపిక చేసిన రంగాల్లో ప్రైవేట్‌ రంగానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలన్నది ఆయన అభిప్రాయం. అంబేద్కర్‌ ఆర్థిక విధానాలపై సమగ్రంగా అధ్యయనం జరగని కారణంగా, కొందరు మధ్యేవాదులు, పూర్తి స్థాయి స్వేచ్ఛా విపణిని అంబేద్కర్‌ సమర్ధించినట్టుగా ప్రచారం చేస్తున్నారు.

అందులో నిజం లేదు. ఆర్థిక రంగానికి సంబంధించి ప్రభుత్వ క్రియాశీల పాత్రను ఆయన సమర్ధించారు. చిన్న కమతాలు, ఉమ్మడి సేద్యం, భూస్వామ్య వ్యవస్థ రద్దు, భూమి శిస్తు..వగైరా అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. భూమిలేని దళిత శ్రామికుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారంతో ఆర్థిక రంగ సమస్యల పరిష్కారంతో ముడివడి ఉన్న విషయం ఆయన గుర్తించారు. వర్తమాన దేశ ఆర్థిక పరిస్థితులపైనా, ఆర్థిక రంగ ప్రజాస్వామ్యీకరణకు అంబేద్కర్‌ ఏం చెప్పేవారో తెలుసుకోవాలంటే ఆయన్ను మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఎత్తైన విగ్రహాలు, చుట్టూ విహార కేంద్రాలకంటే ఆయన ఆలోచనలను విధానాల్లోకి తర్జుమాచేసే మేధోకేంద్రాలను తయారు చేయాలి.
– వి. శ్రీనివాస్‌

(Visited 319 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply