నక్సల్బరీ 50- ఆంధ్రజ్యోతిలో విజయ్ కుమార్ వ్యాసం

నక్సల్బరీ 50- ఆంధ్రజ్యోతిలో విజయ్ కుమార్ వ్యాసం

వాస్తవం అర్థం చేసుకోవాలనుకున్న ప్రతిసారి ఆగ్రహమో, దుఃఖమో, త్యాగమో ఏదో ఒక ఎమోషన్ చూపి మనుషులను కన్విన్స్ చేయలేము. ముఖ్యంగా విప్లవ పంథా, ప్రజల విముక్తి లాంటి గొప్ప విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇంకాస్త నిర్మొహమాటంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది.

రాజకీయ పార్టీల పని విధానం గురించి ప్రశ్నించాల్సి వస్తే, విమర్శించాల్సి వస్తే బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శకు గురైనంతగా మిగతా ఏ పార్టీలు అగుపించవు. ప్రధానంగా మిగతా పార్టీలు కేంద్ర ప్రభుత్వాధికారం చేపట్టేంత గొప్ప స్థాయిలో లేకపోవడం, లేదా ప్రాంతీయతకు పరిమితం కావడం కారణాలు. ఆపై – అంత దుర్మార్గమైన విధానాలు చేపట్టే అవకాశాలు లేకపోవడం వల్ల, ఆ స్థాయిలో విమర్శకు గురికాకపోవడం తెలుస్తుంది. ఒక్కో రాజకీయ స్థాయి కలిగిన పార్టీలు ఒక్కో స్థాయిలోనే, వాటి తరహాలో దళితులను, ఆదివాసీలను, ముస్లిములను మోసం చేస్తూ వస్తూనే ఉన్నాయి. మార్క్సిస్టులు మాత్రం మోసం అనే పదం బదులు ‘అవగాహన లోపం’ అనో ‘దిద్దుబాటు క్రమం’ అనో అందమైన పదాలు తగిలిస్తారు. అలా 50–-60 సంవత్సరాలుగా ‘దిద్దుబాటు క్రమం’లోనే ఉన్నారు వాళ్ళు. ప్రధాన స్రవంతిలోని రైట్ వింగ్, సెంటర్, లెఫ్ట్‌వింగ్ పార్టీల సంగతి వదిలేస్తే, 50 వసంతాలు చూసిన సందర్భంగా ‘నగ్జల్బరీ వసంత మేఘ ఘర్జన’ పార్టీకీ, దాని అనుబంధ సంస్థలకూ అణగారిన ప్రజల పట్ల వున్న నిబద్ధతను ఒకసారి పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది.

చారు మజుందార్ ‘చైనా చైర్మనే మా చైర్మన్’ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి, వ్యక్తి నిర్మూలనను వర్గ నిర్మూలనగా ప్రకటిస్తూ ఎదురుతిరిగి సరిగ్గా 50 సంవత్సరాల క్రితం మావోయిస్ట్ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ‘చైనా చైర్మనే మా చైర్మన్’ అనడమే పిడివాద నినాదం. ఐతే ఆయా మార్క్సిస్టు పార్టీలు ఈ రోజు అదే సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయని చెప్పలేము. ఈ పంథాను రిఫైన్ చేసుకుంటూ గుణాత్మకంగా భిన్నంగా ఉన్న విధానాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ ప్రతిఘటనవాదులు (విప్లవం అనే నిర్వచనం, దాని ఆచరణ ఎంత సరి అయినదో ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేంత వరకు ‘ప్రతిఘటన వాది’ అనడమే బెటర్) చేస్తున్న ఉద్యమాలు చాలాచోట్ల సమాజంలో నిబిడంగా ఉన్నా తీవ్ర అసంతృప్తిని వెలికితీసి ఒక వాయిస్‌గా వినిపించినా ప్రజల మొబిలైజేషన్ మీద అంతో ఇంతో ఒప్పుకోదగ్గ స్థాయిలోనే ఉద్యమాలు చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇందుకు బస్తర్‌లో జరుగుతున్న ఆదివాసీల ఉద్యమం అద్దం పడుతుంది. ఐతే ఇక్కడ సునిశితంగా ఆలోచించాల్సింది ఏంటంటే – చారు మజుందార్ లైన్ నుంచి 180 డిగ్రీలు తిరిగి ఒక కొత్త పంథాను సరిదిద్దుకున్నాక కూడా, చారు మజుందార్ ఇంకా కాంటెంపరరీ రిలెవెంట్‌గా ఎందుకు అనిపిస్తున్నాడు? ఆయుధాలు పట్టడం ప్రధానం అన్నది కూడా ఆయా తిరుగుబాటు పార్టీల ప్రధాన పంథా కాదు, ఆయుధ ధారణ అనేది ఒక తార్కిక క్రమంలో జరుగుతుంది అని వారి ఇంటర్వ్యూలలోనూ, వారి రచనల్లోనూ అనిపిస్తుంది. ఆ విధంగా అయినా సరే చారు మజుందార్ రెలెవెన్స్ కనిపించదు. చారు మజుందార్ పంథా కరెక్టా కాదా అన్న ప్రశ్నతో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, చారు మజుందార్ చెప్పిన ప్రతి ప్రధాన అంశం వదిలేసి, నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గాన్ని అనుసరించే క్రమాన్ని (మంచి కోసమే కావచ్చుగాక) మార్చుకున్నారు. ఇక్కడ చారు మజుందార్ త్యాగనిరతి, క్రమశిక్షణ, దృఢ విశ్వాసం మాత్రమే గీటురాళ్ళుగా మిగిలిపోయి, అనితర నిశ్చల లక్ష్యాన్ని ప్రభావితం చేస్తూ ప్రేరేపించే సైద్ధాంతిక నిష్కపటత్వం గైడింగ్ ఫేక్టర్ అయి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇలా సంస్థాపక నాయకత్వంతోనే పూర్తిగా విభేదిస్తూ, వారిలోని సైద్ధాంతిక నిష్కపటత్వాన్ని గీటురాయిగా మలుచుకుని ఆవేశపడే ఈ ప్రతిఘటన వాదులు, అంబేడ్కర్ లాంటి త్యాగనిరతుల్లో సైద్ధాంతిక నిష్కపటత్వం ఎందుకు చూడలేకపోతున్నారు అన్నది చాలా రెలెవెంట్ ప్రశ్న. అంబేద్కర్ వ్యవస్థలో భాగమై పనిచేసాడు అన్నది వాస్తవమైతే, అదే వ్యవస్థలో పనిచేసి వ్యవస్థకు చిల్లులు పొడిచాడు అన్నది వాస్తవం కదా? ఆయన వ్యవస్థలో భాగం అయ్యి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, ఆస్తులను, హోదాలను పెంచుకుని కులాసాగా గడిపే క్రమంలో పని చేసాడా అంటే అదీ కాదు.

            చారు మజుందార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల చుట్టూ తిరిగి విసిగి వేసారి స్వంత పార్టీ పెట్టుకోవాలనుకునే టైంకు, అంబేడ్కర్ ఇక్కడి కుల వ్యవస్థ దేశ ఆర్థిక పురోగతికీ, సామాజిక సంపద సమగతిన వితరణ జరగడానికీ ఎలా అడ్డంకి అవుతుందో విస్తృతంగా అధ్యయనం చేసాడు. చారు మజుందార్ అంబేడ్కర్‌ను చదవలేదని కంప్లైంట్ కాదు ఇక్కడ; అంబే డ్కర్ అణగారిన వర్గాల, కులాల జీవన సమస్యను ప్రబలంగా భీకర జలపాతంలా ప్రవహింప జేస్తుంటే, ఆ జలపాతంలో కొన్ని నీటి చుక్కలైనా తాకకుండా నూతన ప్రజాస్వామిక విప్లవ సిద్ధాంతం ఎలా అవిర్భవించింది అని. ఈ రోజు చారు మజుందార్ పుట్టి అదే పార్టీలో చేరితే, పిడివాది అనో, అతివాది అనో ముద్ర వేసుకుని బయటపడ్డం ఖాయం. ఇంత బోల్డ్‌గా లైన్ మార్చుకున్న ఆ పార్టీలు, సంఘాలు – నిజాయితీ, నిబద్ధత గల అంబేడ్కర్‌కి ఒక గౌరవనీయ స్థానం ఎందుకు కల్పించలేక పోయాయి? ఈ చర్చ పోలికకు సంబంధించిదిగా పొరబడకుండా setive perceptionకు సంబంధించిన విషయంగా చూడాలి. ప్రతి పార్టీ ఒక conscienceను అంతర్గతంగా తయారుచేస్తుంది. ఆ conscience సోషల్ సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే ఒక ‘హాలో(Halo) ఎఫెక్ట్’ను సృష్టిస్తుంది. దాని ప్రభావం ఏంటంటే-– ‘చేతిలో బాకో, తుపాకీనో ఉండి వాడి సిద్ధాంతం ఏదన్నా సరే పర్లేదు.

               మాకు కావాల్సింది సైద్ధాంతిక నిష్కపటత్వం’ అని భావించడం. అది కూడా నిజానికి పెద్ద ద్రోహపూరితమైన ఆచరణ కాదు గానీ భగత్ సింగ్, చారు మజుందార్‌లు మాత్రమే, ఎన్ని అతివాదాలు, ఎన్ని హాస్యాస్పద వాదనలున్నా చారిత్రక సృష్టికర్తలుగా పరిగణించబడ్డం వైరుధ్య ఆచరణను, అసంబద్ధ తార్కికతను తెలియజేస్తుంది. అందుకే ముందు చెప్పుకున్నట్టుగా– ప్రతి విషయాన్ని ‘ఎమోషనలైజ్’ చేసి కన్విన్స్ చేయడం ఆపి, మనసును నిష్కల్మషంగా నచ్చ చెప్పుకోవాలి కదా? ప్రజల్ను కూడా ఒప్పించాలి కదా?

               ఈ ‘హాలో ఎఫెక్ట్’ క్షేత్రస్థాయిలో వాళ్లను ఎంత గందరగోళానికి గురిచేస్తుందో చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ మధ్య రోహిత్ వేములపై విజయవాడలో ఆ విప్లవ (?) రచయితల సంఘం సభ జరుపుతూ, సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసుల చేతిల్లో అమానుషంగా దెబ్బలుతిన్న దళిత విద్యార్థిని వక్తగా ఆహ్వానించారు. ఆ దళిత విద్యార్థి పేరు కరపత్రంలో అచ్చు వేయిస్తూ బ్రాకెట్‌లో ‘‘మృత్యువుకు చేరువలో వెళ్ళిన విద్యార్థి’’ అని రాశారు. ఇకపై వాళ్ళు వక్తలను పిలిచేటప్పుడు, ఎవరు ఎన్ని సెంటిమీటర్లు మృత్యువు దాకా వెళ్ళి వచ్చారో వేయాలి. ఉదాహరణకు– ఒక దానయ్య శాస్త్రినో, ధర్మాత్మ శర్మనో స్టేజ్ ఎక్కించే ముందు కరపత్రంలో ‘‘కణత మీద పిస్టల్ పెట్టించుకుని బతికి బట్టగట్టిన వ్యక్తి’’ అనో, ‘‘పోలీసులపై రాళ్ళు విసిరిన ఉద్యమకారుడు’’ అనో వేసుకోవాలి ఇక. సైద్ధాంతిక నిబద్ధత స్థాయి నుంచి, అతి చిన్న ఆచరణ వరకు ‘ఫ్రీ థింకర్స్’గా ఉండాల్సిన విప్లవ వాదులు ఈ ‘హాలో ఎఫెక్ట్’ చేతిలో మశానం అవుతున్నారు. ‘ఆత్మ విమర్శ’ ఆంజనేయ దండకం అయ్యింది అని ఇక్కడ వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అది లేకపోవడం వల్లనే – అంబేడ్కర్ గౌరవనీయ తాత్వికవేత్త కాలేకపోయాడు. ఎప్పుడైనా దళితుల మధ్యలో ఏదన్నా సభల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్ప.

            ‘దున్నేవాడికే భూమి’ అని నినదిస్తూ స్టాలిన్, మావోలతో పాటు తమ నాయకుడు చారు మజుందార్ బొమ్మలను ఆయా భూములపై అక్కడి నగ్జల్బరీ రైతులు పాతిపెట్టి ఉద్యమించారు. (చారు మజుందార్ అప్పటికి బతికే ఉన్నాడు. అప్పుడప్పుడే మాతృపార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడివడ్డాడు. ఆయన బొమ్మను కూడా మావోతో పాటు పెట్టాలనుకునే నిర్ణయం వ్యక్తి పూజ కిందకు రాదు అని వాళ్ళ వాదన. అది ఇక్కడ ప్రస్తుతం కాదు. వదిలేద్దాం). ఫలితంగా పోలీసులు సుమారు పది మంది రైతులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసారు. అక్కడి నుంచి మహా జ్వాలలు ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో పెల్లుబికాయి. సరిగ్గా సంవత్సరన్నర తర్వాత, జీతాల పెంపు విషయంలో తమిళనాడులోని కీలవేన్మణిలో సీపీఎం నేతృత్వంలో తిరగబడిన 40 మందికి పైగా దళిత కూలీలను అక్కడి అగ్రకుల భూస్వాములు సజీవంగా కాల్చి చంపేసారు. కాలక్రమంలో సీపీఎం ఆ ఉద్యమాన్ని స్థూపం స్థాయి దగ్గరే ఆపి ముందుకెళ్ళింది. ఆపై – కీలవేన్మణి, నగ్జల్బరీ కంటే ఘోరంగా జరిగిన రాజ్య దమనకాండ చరిత్రలో మరుగున పడిపోయింది. వంద, వేలల్లో నగ్జల్బరులను సృష్టించగలిగే కీలవేన్మణి, దళితులలో నిర్ణయాత్మక చైతన్య స్థాయి లేకపోవడం వల్ల, ఇండియన్‌ మార్క్సిస్టుల చేతిలో తార్కిక మరణాన్ని చవిచూసింది.

               కుల నిర్మూలనా పోరాటాలు, కుల నిర్మూలనా సిద్ధాంతాలు వీటితో ఎన్ని విభేదాలున్నా ఆయా వ్యక్తులు, ఆయా పోరాటాలు విప్లవ పురోగతికి దోహదం చేస్తాయనీ, complementaryగా ఉంటాయనీ అనుకుంటే, చారు మజుందార్‌ను ‘own’ చేసుకుంటూ అతని సిద్ధాంతాలను ‘disown’ చేసుకునే పార్టీలకు, తమలోని అభిజ్ఞాత్మక పక్షపాతం (cognitive bias)ను పరిశీలించుకుని అంబేడ్కర్ ప్రతిపాదించే సైద్ధాంతిక ఆలోచన విధానాన్నీ, అంబేడ్కర్‌నూ ‘ఓన్’ చేసుకోవాల్సిన రోజు ఎవరి వల్లనో బలవంతంగానైనా వస్తుంది. ఈ దిశగా దళితవాదం సఫలం అయినట్టే అని చెప్పుకోవచ్చు. విరసం లాంటి సంస్థలు మార్క్సిజంతో ఏమాత్రం సంబంధం లేని చలం, గురజాడ సభలు జరుపుకుని ఆనందించడం కాక అఖిల భారతంలో ఇప్పటి వరకు పుట్టిన అసామాన్య మేధావి, ప్రథమ Egalitarian (సమానత్వ) సిద్ధాంత కర్త, మెజారిటేరియనిస్ట్ ధోరణులపై గొంతెత్తిన మొదటి హక్కుల ఉద్యమకారుడు, దళితవాద దృక్పథానికి పునాదివేసిన తత్వవేత్త అయిన అంబేడ్కర్ నుంచి నేర్చుకునే విషయం గురించి ఆలోచిస్తే ఇంత వరకు విప్లవాన్ని పీడిస్తున్న పిడివాదం సగం బద్దలైనట్టే. అప్పుడు ఇన్నాళ్ళు జరిగిన ‘‘ఆత్మ విమర్శ, విమర్శలు రెండూ దండగే, పై నుంచి కింద వరకు ప్రక్షాళన అవసరం’’ అనుకునే సందర్భం లాజికల్‌గానే ముందుకొస్తుంది.

-పి. విక్టర్ విజయ్ కుమార్

(Visited 71 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply