దళితులకు భగత్‌సింగ్‌ పిలుపు

దళితులకు భగత్‌సింగ్‌ పిలుపు

(”అచూత్‌ సమస్య” (అంటరానితనం సమస్య) పేరుతో భగత్‌ సింగ్‌ హిందీలో రాసిన వ్యాసం 1929లో ”కీర్తి” పత్రికలో ప్రచురించ బడింది. వ్యాసంలోని కొన్ని భాగాలను ఇక్కడ ఇస్తున్నాం… సంపాదకుడు)
”మన దేశం నిజంగానే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చాలా విచిత్రమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందులో ముఖ్యమైంది 30 కోట్ల జనాభాలో 6 కోట్ల మందిని అంటరానివారుగా పరిగణించడం.
ఉదాహరణకు:-
అంటరానివారిని ముట్టుకుంటే ఉన్నత కులాల వ్యక్తి మైలపడిపోతాడా?
గుడిలో దేవుళ్లు అంటరానివారు ప్రవేశిస్తే ఆగ్రహం చెందుతారా?
బావిలోనుండి అంటరానివారు నీళ్లు తోడుకుంటే కలుషితమైపోతాయా?
ఇరవయ్యో శతాబ్దంలో ఈ ప్రశ్నలు వేసుకుంటున్నామంటే, మనం సిగ్గుతో తలవంచుకోవాలి.
మనం, భారతీయులం, మన ఆధ్యాత్మిక సంపద గురించి గొప్పలు చెప్పుకుంటాం. కానీ ప్రతి మనిషీ మనలాంటివాడేనన్న విషయాన్ని విస్మరిస్తాం. కానీ డబ్బు సంస్కృతి ఒంటబట్టిందని చెడ్డపేరు తెచ్చుకున్న పశ్చిమ దేశాల వారు మాత్రం సమానత్వం సూత్రాన్ని గాఢంగా నమ్ముతారు. దీన్ని వారు అమెరికా, ఫ్రెంచ్‌ విప్లవాల్లో చూపించారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో రష్యా విప్లవంలో ప్రదర్శించారు. రష్యా విప్లవం ఈ సమానత్వ సూత్రాన్ని జనజీవనం లోని అన్ని రంగాలకూ విస్తరించింది. ఎటువంటి రూపంలోనూ వివక్ష లేకుండా రూపుమాపింది. ఆ విధంగా అది మే దినోత్సవ లక్ష్యాలను పరిపూర్తి చేసింది. కానీ మన దేవుళ్ల గురించీ, దేవతల గురించి అలుపులేకుండా గొప్పలు చెప్పుకునే మన భారతీయులం మాత్రం అంటరానివారు జంధ్యాలు ధరించొచ్చా, కూడదా, వారిని వేదాలూ/శాస్త్రాలూ చదవడానికి అనుమతించొచ్చా, కూడదా అని చర్చోపచర్చలు చేస్తున్నాం.
…..
ఇది ఎంతటి సిగ్గుమాలిన విషయమో ఊహించండి! కుక్క కూడా మన ఒళ్లో కూర్చోవచ్చు. అది మన ఇంట్లో, వంటిట్లో స్వేచ్ఛగా తిరగొచ్చు. కానీ ఒక సాటి మనిషి నిన్ను అంటుకుంటే నీ ధర్మం ప్రమాదంలో పడుతుందా? అంటరానివారిపట్ల సానుభూతితో ఉండే పండిట్‌ మాలవ్యా జీ లాంటివారు కూడా తొలుత బహిరంగంగా అంటరానివారిచేత పూలమాల వేయించుకోడానికి అంగీకరించారు. కానీ తరువాత తాను కలుషితమైపోయానని స్నానం చేసి, బట్టలు ఉతికేశారు. ఎంత ఘోరం! మనందరిలో ఉన్నాడని చెబుతున్న దేవుణ్ణి పూజించే గుడిలోకి ఒక పేదవాడు ప్రవేశిస్తే అది మైలపడిపోతుందా, దేవుడు ఆగ్రహం చెందుతాడా?…….
విస్తృత సామాజిక కోణంలో చూసినప్పుడు అంటరానితనానికి ఒక హానికరమైన సైడ్‌ ఎఫెక్ట్‌ ఉంది; ప్రజలు జీవనానికి ముఖ్యమైన పనుల పట్ల ఏహ్య భావం పెంచుకుంటారు. మనకు బట్టలు నేసే నేతగాళ్లను అంటరానివారుగా చూస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో మంచినీళ్లు తెచ్చేవారిని కూడా అంటరానివారుగా చూస్తారు. ఇదంతా శ్రమ గౌరవాన్ని, ముఖ్యంగా శారీరక శ్రమ గౌరవాన్ని తగ్గించడం ద్వారా మన దేశ పురోగమనానికి అడ్డంకిగా మారింది. అందువల్ల దేశం పురోగమించాలంటే వారిని అంటరాని వారు అనడం, పరిగణించడం మానేయాలి….
…..
”స్వేచ్ఛగా ఉండేవారే మొదటి రాయి వేయండి” అనేది నానుడి. ఉన్నత తరగతికి చెందిన ప్రతి ఒక్కరూ తమ హక్కులను అనుభవించడమే కాదు, తమకింద ఉన్నవారిని అణచి ఉంచడానికీ, పేదలను తన కాళ్ల కింద ఉంచుకోడానికీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్న విషయం మనం గమనంలో ఉంచుకోవాలి. ఆ విధంగా బలం గలిగేది ఏదైనా సరైందే అన్నట్లు సాగిపోతోంది. అందువల్ల మీరు సమయాన్ని వృధా చేయొద్దు. మీ స్వంత కాళ్లమీద ఐక్యంగా నిలబడండి, ప్రస్తుత సామాజిక వ్యవస్థను సవాలు చేయండి.
మీకు రావలసింది రాకుండా చేసేందుకు సాహసించేవారెవరో చూద్దాం. ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడొద్దు. వారిపట్ల భ్రమలు వద్దు. అధికార వార్గాల ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వారు మీకు స్నేహితులు కాకపోగా, వారికి కావలసినట్లు మిమ్మల్ని ఆడిస్తారు. నిజం చెప్పాలంటే పెట్టుబడిదారీ, అధికారవర్గాల సంఘటన మీ అణచివేతకూ, పేదరికానికీ కారణం. అందువల్ల వాళ్లకు దూరంగా ఉండాలి. వాళ్ల కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బయటపడే మార్గం అదే. మీరే నిజమైన కార్మికవర్గం. కార్మికులారా ఐక్యం కండి, మీకు పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. లేవండి, ప్రస్తుత వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడండి. క్రమంగా మారడం, సంస్కరణలతో మారడం మీకు తోడ్పడదు. సామాజిక ఉద్యమంతో విప్లవాన్ని ప్రారంభించండి. రాజకీయార్ధిక విప్లవానికి సమాయత్తం కండి మీరు. మీరు మాత్రమే జాతి మూల స్తంభాలు, మూల శక్తి. లేవండి. నిద్రపోతున్న సింహాల్లారా! తిరగబడండి, తిరుగుబాటు బావుటా ఎగురవేయండి.

(Visited 147 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply